పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/340

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మణిమంతునికథ.

329

నాఁటి యుదయమునకు మాగృహములన్నియు బంధుజనముతో నిండి పోయినవి.

పదివేలమందిజనులు నివసించుటకుఁ దగినట్లు పెండ్లివారికి విడిది నేరుపరచితిని. దారిలో స్నానకవ్రతము జేసికొని సుముహూర్తమునాఁటి యుదయమునకే వత్తుమని యీతఁడు మాకు జూబువ్రాసెం గావున వారికొఱకు నిరీక్షించుచుంటిమి సూర్యోదయమైనది. యెంతయో వైభవముతోఁ బెండ్లివారి కెదురేఁగవలయునని యందర నాయత్త పరచియుంచితిని. వీరిజాడయేమియుఁ గనంబడ లేదు. జాముప్రొద్దెక్కినది. రెండుజాములైనది. రాలేదు. గుఱ్ఱములెక్కించి రౌతులఁ బరుగెత్తించితిని. పెద్దదూరము పోయి వచ్చి యెవ్వరు గనంబడలేదని చెప్పిరి. ముహూర్తము రాత్రిగదా దారిలో భోజనముచేసి లగ్నము వేళకు వత్తురని తలంచి మాసన్నాహములో మేముంటిమి.

అంతలో సూర్యుఁ డస్తమించెను. అప్పటికిని రాలేదు. పందిళ్లన్నియుఁ బ్రేక్షకులతో నిండిపోయెను. వింతవింతలుగా దీపమాలికలు వెలిగింపఁబడినవి. పెక్కుచోట్ల వారాంగనలు నృత్యములు సేయు చుండిరి. వైణుకులు పాడుచుండిరిఁ నాటకు లాడుచుండిరి. హాస్యములు చెప్పుచుండిరి భూమండలములోఁ దూర్యనాదము లెన్ని భేదములు గలిగియున్ననో వానినన్నియుం దెప్పించితిని కావున నానినదములన్నియు శ్రోత్రపర్వముగా మ్రోగుచుండెను. దిగ్దంతులవంటి చతుశ్శాస్త్ర పండితులు కవీశ్వరులు సిద్ధాంతులు నవధానులు వేనవేలు బ్రాహణులు నానాదేశములనుండి వచ్చి వివాహమంటప మలంకరించి శాస్త్రవాదములు చేయుచుండిరి. పెండ్లికొడుకుజాడమాత్రము లేదు.

అప్పుడు నేను మిక్కిలి పరితపించుచు నేమియుందోచక వారు వచ్చుదారిలోఁ బోయి నిలువంబడితిని. పురోహితుఁడు వచ్చి మణిమంతా! ఇఁక రెండుగడియలలోఁ బీటలపైఁ గూర్చుండవలసియున్నది.