పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/339

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

328

కాశీమజిలీకథలు - పదియవభాగము.

అదిమొదలు నేను నాపరిజనులు వీరింటిచుట్టు నాఱుమాసములు దిరిగితిమి. మాకు రాకపోకలకుఁ బదివేలు వ్యయమైనది. ఎట్టకేల కీమహానుభావుఁ డనుమతించెను. అతడు కోరినంతసొమ్మిత్తు నన్నప్పు డనుమతి కాకయేమి? దేశదేశములనుండి సిద్ధాంతుల రప్పించి యాఱుమాసములు వ్యవధియుండగా సుముహూర్తమునిశ్చయించితి అట్టిముహూర్తము మఱియొకటిలేదని యేకగ్రీవముగా సిద్ధాంతులందరు నొప్పుకొనిరి. ఆపైన మూఢమి వచ్చునఁట. అటుపైని నధిక మాసమట. ఆపైన క్షయవత్సరమట. ఆసుమూర్తము దాటినచో మూడేండ్లవఱకు మఱియొక సుముహూర్తములేదని సిద్ధాంతులు చెప్పియున్నారు. అదే స్థిరపరచి పనులు ప్రారంభించితిమి. మహారాజా ! నూఱ్వురుచిత్రకారు లాఱుమాసములు కేవలము పందిళ్లపని చేసిరి. నవరత్నములు నద్దినట్లుగా బందిళ్ల పైఁ జిత్రించిరి. వివాహమంటపము మీఁది పందిరికి నిరువదివేలు వ్యయమైనవి. ఆపందిళ్ల వైభవము చూచితీరవలయును. ఇప్పటికి నట్లేయుండునుకాని యీమహానుభావుఁడు దుడ్డుకఱ్ఱలవాండ్రతో వచ్చి యాపందిళ్లన్నియుఁ బాడు చేయించెను. పేరుపొందిన నూఱుభోగము మేళముల నూఱ్వుర వైణికుల నూఱ్వుర గాయకుల నాటకుల భాగవతులఁ బెక్కేల ఎక్కడ నేవిద్యలోఁ బేరుపొందినవిద్వాంసుఁ డున్నాడని వినిన నక్కడనుంచి యట్టివాని నాపెండ్లికిఁ దగినవెలయిచ్చి రప్పించితిని. ఆపెండ్లిదినములలో మాయిళ్లు మహేంద్రవైభవముతో నొప్పుచుండునవి. సుముహూర్తమునకు మూడుదినములకు ముందరనే వారందఱువచ్చి చేరిరి. నెలదినములు వ్యవధియుండఁగనే బంధువులువచ్చి చేరిరి. అప్పుడే యుత్సవములు ప్రారంభించిరి. సుముహూర్తము సమీపించినకొలఁది మాకు సంతోషావేశ మెక్కు.వయగుచుండెను. సుముహూర్తము