పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/338

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మణిమంతునికథ.

327

చితిని. చివరకుఁ గన్యకాపరమేశ్వరీ కృపావిశేషమున నొక్కయాఁడు పిల్ల కలిగినది. దానినేపుత్రుఁగా భావించి యపురూపపు గారాముతోఁ బెనుచుచుంటిమి. జాతకర్మకు నేబదివేలు వ్యయపెట్టితిని. నూఱ్వురఁ బాలదాదులను రెండువందలమంది యాడించు పిల్లదాదులను నూఱ్వుర రక్షకుల నియమించి బెంచుచుంటిమి. డోలికోత్సవము, అన్నప్రాశనోత్సవము, దంతాగమనోత్సవము, విద్యాభ్యాసోత్సవము, ఒకటననేల ఏదియో పేరుపెట్టి దినమున కొక యుత్సవము చేయుచుండెడి వారము.

ఈచిన్న కార్యములకే యీవతన్‌కుఁ డింత వ్యయపెట్టుచున్నాడు. కూఁతురి పెండ్లి కెంత వ్యయము చేయునో యని యనుకొనుచుఁ గొందరు నన్నామాట యడిగిరి. అప్పటి యుత్సవము మీరే చూతురుగాక. ఇదివఱకు భూమండలములో నిట్టియుత్సవ మెక్కడను జరుగలేదని జనులు స్తోత్రములు చేయునట్లు కావింతునని చెప్పుచుందును.

పిల్ల కై దేండ్లు దాటినది మొదలు పెండ్లి ప్రయత్నము చేయుఁడని నాభార్య నన్ను నిర్భందించు చుండెను. మఱిరెండు సంవత్సరములు నేను మనసులో నాలోచించుచు, బిమ్మట దేశముల వెంబడి త్రిప్ప మొదలిడితిని. నాలుగేండ్లు దేశములు త్రిప్పుటతోడనే గతించినది. మాకు సరిపడిన సంబంధ మెక్కడను దొరకలేదు. ఒక్కమాట చెప్ప మఱచితిని మా వైశ్యులలోఁ గన్యకాపరమేశ్వరీ శాపంబునఁ జక్కని కన్యకలుండరు. నాముద్దులపట్టి నాయమ్మవారు ప్రసాదించినది కాబట్టి బహుసౌందర్య శాలినియై యొప్పుచున్నది. దాని కూర్మిళయని పేరు పెట్టితిని. దానిచక్కఁదనమునకు సరిపడినవరుఁ డెందును దొరకలేదని పరితపించుచు శుకద్వీపమున నీరత్న పాదుని కుమారుఁడున్నాడని విని నలువురుబ్రాహ్మణుల ననిపితిని. వారు వీని స్థితిగతులు వరుని విద్యా శీలములు విమర్శించివచ్చి యన్నిటికిని నీకుఁదగిన సంబంధమని చెప్పిరి.