పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/333

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

322

కాశీమజిలీకథలు - పదియవభాగము.

రాజు -- బలే. బాగు. ఇందు దేశమేలు రాజస్త్రీలుగూడ వేశ్యావృత్తి వహింతురని మాకుఁ దెలిసినది కాదు. మంచి యా చారమే.

రత్న - రాజనందనా ! నావృత్తాంతమంతయును విని పిమ్మట నాక్షేపింపుము.

రాజు – నీవృత్తాంతము వినక తెలిసికొనక యితదూర మెట్లు వచ్చితిని ? గోటకుఁగట్టిన పట్టము నీవృత్తాంతమంతయుఁ జెప్పుచుండ లేదా? ఏదో మారుమూలగ్రంథములోనున్న నారీసాంకేతిక శ్లోకములు నాలుగు వర్ణించి కట్టుకథలవంటిప్రశ్నము లడిగి వానిం జెప్పలేకున్న సకలకళాపారంగతుల నిర్వక్రపరాక్రమవంతులఁ గూలివాండ్రగాఁ జేసికొందువా? నీవ్రాఁతలకుం గట్టుబడియింతదనుక నుపేక్షించితిమి. నిరుపమవిద్యాబలశాలియగు మాతమ్ముని మొన్న బరిచరుంగాఁ జేసికొంటి వతం డెట్టివాఁడో యెఱుంగుదువా? న్యాయంబునకుఁ గట్టుపడియెంగాని యువ్వెత్తుగా నీ రాజ్యము నిన్నుఁగూడ మట్టుమాపకపోవునా? ఈదేశమును బాలించు నీవే యిట్టికపటకృత్యములు సేయుచుండ నిందుఁ గాదనువారెవ్వరు? రాజస్త్రీవై వేశ్యనని చెప్పుకొంటివేల ? ఇది యెట్టిగౌరవమని యత్యంతకోపముతోఁ బలుకుటయు నక్కుటి లాలక యతని యలుకకు వెఱచుచు నడుగులంబడి యిట్లనియె.

మహాత్మా! నావృత్తాంతమంతయు విని తప్పున్న గోపింపుఁడు. ఇది స్త్రీరాజ్యము. నేనీరాజ్యమునకు వచ్చి సంవత్సరము దాటినది. మా దేశాచారములు కడు విపరీతములు. ఇందు విద్యాధికులగు పురుషులు చాల తక్కువగానున్నారు. నేనుత్తముఁడగు పతిం బడయఁగోరి యొక బౌద్ధసిద్ధు నాశ్రయించితిని. ఆబౌద్ధసన్యాసి నాభక్తికి మెచ్చి నాకీశ్లోకములుగల ప్రశ్నోత్తరములు వ్రాసియిచ్చి వీని కీరీతిఁ బ్రత్యుత్తరమిచ్చిన వానిం బెండ్లియాడుము. అని చెప్పి పోయెను.