పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/332

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహారాజరత్నముకథ.

321

ఆమేడ వీధిగోడకు వ్రేలంగట్టిన చిత్రఫలకము మహారాజరత్నముదని వ్రాయఁబడి యున్నది. ఇందు మఱియొక రమణీమణి చిత్రఫలకము గనంబడుచున్నది. ఈచిన్నది మఱియొకతె కాఁబోలు. దీనికిఁ గిరీటములు కేయూరములుగూడఁ గలిగియున్నవి. ప్రభుచిహ్నముల వేశ్య యెట్లు దాల్చెడిని ? ఏమో. దేశాచారభేధము లెవ్వఁ డెఱుంగును ? అని యాలోచించుచున్న సమయంబున,

క. కుందనపుబొమ్మయనఁ మెఱు
   పుందీగె యనంగఁ గాంతిపుంజికయనఁ బొ
   ల్పొందు నొక సుందరీమణి
   యందుల కరుదెంచెఁ బరిజనావృతయగుచున్ .

కిరీట కేయూర కరవాలాదిప్రభుచిహ్నాలంకారముల దాల్చియున్న యాయన్నుమిన్నం జూచి యతం డౌరా ! ఈనారీరత్నము మున్ను నే చిత్రఫలకంబునఁ గన్నదికాదు. ఇది వేరొకతె. ఆమహారాజరత్న మెందున్నది? దీనిరాకకు గతంబేమి? నాచే జయింపఁబడిన చేడియయెవ్వతె? దాని మొగమే చూచియుండలేదేయని యాలోచించుచుండనయ్యండజగమన మెల్లన నతనినికటమున కరిగి పదంబులకు నమస్కరించుచు,

క. ఫలియించె నిప్పటికి నా
   యలఘుపురాకృతఫలం బహా సకలకళా
   లలితు నినుఁ బతిగఁ బడసితి
   నిల ననుఁబోలిన వధూటి యెటలే దరయన్.

రాజ --- ఓహో ! నీవేశ్యాలాపములు నాకడ నుపచరింపవు నీవు ఏకపరిగ్రహవా? అనేకపరిగ్రహవా ? ఆపగ్రహవా ?

రత్నమకుట —- రాజపుత్రా! నేను వేశ్యను గాము. ఈదేశము పాలించు నధికారిణిని. నాపేరు రత్నమకుట యండ్రు.