పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/330

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహారాజరత్నముకథ.

319

ఎఱ్ఱదారములు చుట్టుటచే నీయం దనురాగము కలదనియు నింతకుముందు మన్మధవ్యాపారము లేదనియు నైదుగోళ్లు గ్రుచ్చుటచేమన్మధుని పంచబాణముల బాధ యెక్కువగా నున్నదనియు నభిప్రాయమని గ్రహించి యతండు,

శ్లో॥ స్మరేణోద్భిన్న దేహ త్వే సచ్ఛిద్రం వస్త్ర ముత్తమం

అని యుండుటచే నది పంపిన మైనము ముద్రకు చిల్లులుపొడిచిన మంచిగుడ్డ గట్టి యంపెను. అనగా నాదేహము మన్మధుని చేఁజిల్లులు చేయబడినది. అని తెలుపు సూచన తెలియఁజేసెను. పిమ్మట నాకొమ్మ తాంబూల ప్రశ్నలు వైచినది,

శ్లో॥ తాంబూల విటకాః పంచకీర్తి తా నరపుంగవైః
      కౌశలాంకుశ కందర్ప పర్యంక చతురశ్రకాః

కౌశలము శలాకసూత్రరహిత మైనది. అంకుశము, అంకుశాకారము, కందర్పము, త్రికోణాకారము గలది. మధ్యబాణాకారముగ నుండును. పర్యంకము పర్యంకాకారముగలది, చతురశ్రము-నాలుగు కోణములుగలది. అవి యైదువిధములతో నొప్పుచున్నది. అందు బర్యంకమను విటకము పళ్లెమున నిడి పంపినది.

శ్లో॥ పర్యంకస్సంగమాశయా,- అని యుండుట గ్రహించి రాజపుత్రుండు, శ్లో. బాహ్యేచందన పంకాక్త మత్యర్థ మనురాగతః- అని యాతాంబూల వికటముపై మంచిగంధము నంటించి యనిపెను. నాకు నీయందుఁ జాల యనురాగము కలిగియున్నదని సూచించెను.

ఈరీతి తానుపంపిన నారీ సంకేతనము లన్నియు నతండు గ్రహించి తగినట్లు ప్రత్యుత్తర మిచ్చినంత నక్కాంతారత్నము సంతోషించుచు నెడమచేతి మధ్యాంగుళి నడిమిరేఖ నాఁడు తిరుగా రావలయునని వ్రాసియంపినది. అది చదివికొని యతండు,