పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/33

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

కాశీమజిలీకథలు - పదియవభాగము.

సభ్యులారా! గంధర్వులకుఁ గులవిద్యయగుట సంగీతమునకు, గాంధర్వమని పేరువచ్చినది. ఇది గంధర్వలోకమగుట నావిద్య: యిందుఁ బరీక్షింపఁబడుచున్నది. ఆవిద్యలోఁ బ్రసంగింప నింతకు మున్ను పేరులు వ్రాసిపంపినవారందఱు నీందు వచ్చియున్నవారని తలంచెదము. గానమన వీణాగానమేగానము. వైణికులే యిందుఁ బరీక్షింప బడుదురు. మనోహరముగాఁ బాడుట తచ్ఛాస్త్రములోఁ బ్రసంగించి గెలుపుగొనుట వీనిలో నెవ్వఁడు త్తముఁడని పేరుపొందునో వానికీమహతి పార్వతీమహాదేవి పారితోషికముగా నీయఁగలదు. పిమ్మట నీమహతిపై మంజులముగాఁ బాడి సభ్యుల రంజిల్లంజేసిన యంత సతనికిఁ ద్రిలోకసంగీతవిద్వద్రత్నమని బిరుద మీయఁబడును. అట్టి సమర్ధుఁడెవ్వఁడో లేచి ముందరకు రావలయుననిపలికి సురగురుండు గూర్చుండెను. క్షణకాలమాసభ చిత్రింపఁ బడినట్లు నిశ్శబ్దంబై యొప్పెను. అంతలో,

సీ. ఊర్ధ్వపుండ్రములు దామోదరోత్తమభక్త
            శేఖరత్వము ప్రతిష్ఠింపుచుండఁ
    జారుతేజము చిరాచరితాధిక తమప్ర
            భాసజ బ్రహ్మత్వపటిమ దెలుప
    లలితావయవ కోమలత సర్వగంధర్వ
           సార్వభౌమత్వ లక్షణము బలుక
    వాగ్వైభవంబు సర్వకళావిశేష పాం
           డిత్యోచ్ఛ్రయం బుగ్గడింపుచుండ

గీ. లీల నుపబర్హణుం డట్టెలేచి యాది
    జంపతుల కంజలిఘటించి సభ్యులెల్ల
    విన్మయంబంది చూడంగ వివశులగుచు
    జలద నిర్ఘోష లలిత వాక్కుల వచించె.