పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/328

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహారాజరత్నముకథ.

317

వలెనే పరాభవము నొందగలఁడు అని వ్రాయఁబడియున్నది. ఇట్లు వ్రాసినవాఁడు,

శ్లో॥ కేచిద్భాషాంతరకృతతయా కామశాస్త్రప్రబంధా
     దుర్విజ్ఞేయా గురుతరతయా కేచిదల్పార్థ కాశ్చ
     తత్పద్మ శ్రీవిరచితమిదం సర్వసారం సుభోధం
     శాస్త్రం శ్రీఘంశృణుత సుధియోభీష్ట ధరార్థకామాః.

పద్మశ్రీ యను బౌద్ధసన్యాసి రచించుటచే నిందలి విషయంబు లశాస్త్రీయములని చెప్పుటకు వలనుకాదు. అందులకే మాతమ్ముడు అంకీకరించి బద్ధుండయ్యెను.

నాకిప్పుడీ గ్రంధవిషయంబు లన్నియు క్షుణ్ణముగా నున్నవి. రాజరత్నమును దృటిలో జయింపఁగలనని యాలోచించుచు నాయా ఘట్టమునందలి శ్లోకములు వ్రాసికొని వర్లించుచు నింటికిఁబోయి మఱునాఁడు సాయంకాలమున శృంగారవేషముతోఁ రాజరత్నము నింటికిఁ బోయెను.

అఱుగెక్కి యెవ్వరి నడుగక యే ప్రకటన పట్టములోనున్న ప్రకార మందలి గంటమ్రోగించెను. అంతలో లోపలనుండి యొక పురుషుఁ డీవలకువచ్చి మీరెవ్వరు ? గంటమ్రోగించితిరేల ? రాజరత్నముతోఁ బ్రసంగింతురా ? అని యడిగిన నతం డౌను. అందుల కే వచ్చితినని చెప్పెను. ప్రకటన పట్టము చదివికొంటివా ? అందుల నిబంధన కొప్పుకొంటివా! ఒడంబడినచో నీకాగితముపై వ్రాఁలుచేయుమని చెప్పెను. అంగీకరించితినని యాతండు వ్రాలుచేసెను.

ఆపురుషుఁ డాయొడంబడిక పత్రిక లోపలికిఁ దీసికొనిపోయిన యరగడియలో నిరువురు పరిచారికలు లోపలినుండి వచ్చి యొకతె కాళ్ళుగడిగినది. ఒకతె నివాళి యిచ్చినది. సవినయముగా నతనిం దీసికొనిపోయి విచిత్రాలంకార భూయిష్టంబగు నొక గదిలోఁ దల్పంబున