పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/325

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

314

కాశీమజిలీకథలు - పదియవభాగము.

ర్యము నీకుఁ జేయశక్యము కాకపోవదు. వినుమని యిట్లనియె.

పుష్ప కేతుఁడు - రత్న కేసరీ! నీకెక్కడపని?

రత్న కేసరి – మహారాజరత్నమను వేశ్యకడ

పుష్ప - నీవక్కడ నేమిచేయుచుందువు?

రత్న - సఖురాలువోలె గౌరవములైనపనులుచేయుచుందును.

పుష్ప - నీ వేమి చదువుకొంటివి ?

రత్న - సామాన్యమైన చదువే.

పుష్ప - రాజరత్నమో ?

రత్న - అబ్బో! అది గొప్ప విద్వాంసురాలు. ఆమెకు రాని చదువులేదు.

పుష్ప — అది విద్వాంసులతో వాదించి యోడించునఁట యే విద్యలలోనో యెఱుంగుదువా?

రత్న - అది నాకుఁ దెలియదుసామి.

పుష్ప - ఓడిపోయినవారి నేమిచేయును ?

రత్న - తోటలలోఁ బనిచేయించునుసామి. నిన్ననే యొకఁడు పాపము చక్కనివాఁడు మీవలెనున్నాఁడు. వాని నోడించి తోటలోని కనిపినది.

పుష్ప - వానితో నెట్లు వాదించినదో చెప్పగలవా ?

రత్న — ఆసాంకేతకములు మాకేమియుఁ దెలియవు. ఏదియో సాంకేతికమువ్రాసి యంపుచుండును. తగుసమాధానము రానిచో లాగివేయును. నిన్న నేనే యాసంవాదమంతయును జరిపితిని.

పుష్ప — ఆ జరిపిన యుత్తరప్రత్యుత్తర పత్రికలు నీయొద్ద నున్నవియా?

రత్న - ఆ. వానిం దీసికొనిరాఁగలను. కట్టకట్టి మంచము పందిరిమీఁదఁ నేనే పెట్టితిని.