పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/320

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పుష్ప కేతునికథ.

309

నెఱింగించి తమ వృత్తాంతము పూసగ్రుచ్చిన ట్లెఱింగించి సౌభాగ్య సుందరిని సంతోషపారావార వీచికల నుయ్యెల లూగించిరి.

క॥ కొడుకుల నక్కునఁజేర్చుచు
     గడువడిఁ గోడండ్రఁ దిగిచి కనుగొనుచు నొడల్
     బుడుకుచు నామె కొమారుల
     నడిగిన మాటలనే మఱియు నడుగుచు వేడ్కన్.

సౌభాగ్యసుందరి దివ్యరూపసంపన్నులగు కోడండ్రను గొడుకులను దనకడనే యుంచికొని వారివారి చరిత్రములం బలుమారు వినుచు గడమకొడుకులు గూడ నింటికి వచ్చినచో నిఁక నా కేవిచారము నుండదని పలుకుచు సంతోషముతోఁ గాలముగడుపుచుండెను.

అని యెఱింగించి మణిసిద్ధుండు. . . ఇట్లు చెప్పు దొడంగెను.

_________

239 వ మజిలీ.

దక్షిణదిగ్విజయము

పుష్ప కేతుని కథ.

పుష్ప కేతుఁడు మయూరధ్వజుఁడు చిత్రభానుఁడు సౌమ్యుఁడు పింగళుఁడు వీరేవురు దక్షిణదిగ్విజయము సేయఁదలంచి తండ్రియనుమతి బొందకయే రహస్యముగాఁబయలుదేరి యాంధ్రకర్నాటకేరళాది దేశవిశేషములఁ జూచుచుఁ గాంచీపురాదిదివ్యక్షేత్రంబుల సేవింపుచు ద్రవిడదేశంబు జొరపడి యందలివింతలనరసి పాండ్యదేశంబు మీఁదుగా స్త్రీరాజ్యంబుజేరి తద్రాజధానియగు పుష్పపురంబు ప్రవేశించిరి.

ఆనగరము పదియామడ వెడల్పును పదాఱామడ పొడవును గలిగియున్నది. విశాలములైన వీధులచే సౌధములచే నొప్పుచున్నది.