పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/32

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉపబర్హణుని వివాహము

19

మాలావతీ ! ఇప్పుడు వేళచాలదు. తరువాత నారహస్యము లెఱింగింతు. సభకుఁ బదుఁడు. అతండెట్టివాఁడో నేడు తెలియఁబడుఁ‘గాదె. ఇప్పుడు చెప్ప నేల? అనిపలికి యటఁగదలి సామాన్య వేషముతో నువబర్హణునిబసలోని కరిగెను. అందొక వీణ సవరించి యాలాపించుట కమరింపఁబడి యున్నది. తుంబురుఁడు అందున్న శారదుం బల్కరించి యుపబర్హణుం డెందున్న వాఁడని యడుగుచు నావీణనంటి తంత్రులమ్రోగించి మెట్లుపరికించి యాప్రస్తారప్రకార మేమియుం దెలియక సిగ్గుపడుచు దిగ్గునమరలి నీవెవ్వండ వెందులకువచ్చితివని శారదుఁడడుగుచుండ వినిపించుకొనక మెల్లగా నవ్వలకుఁబోయెను.

అంతలో నలంకరించుకొని యుపబర్హణుఁడు: మేడదిగి వచ్చి శారదునితోఁగూడ బండియెక్కి సభాభ్యంతరమున కరగి యొకపీఠంబునఁ గూర్చుండెను. తోడనేయతని పరిజనులావీణఁ దెచ్చి ముందరిపీఠంబున నునిచిపోయిరి.

అసభ విశ్వకర్మచే నిర్మింపఁబడినదగుటఁ బీఠములచే విచిత్రముగా బ్రస్తరింపఁబడియున్నది. సంగీత ప్రసంగముచేయఁగలస్త్రీలును బురుషులు గరుడగంధర్వసిద్ధవిద్యాధరాదులు దిక్పతులు యధాగతముగావచ్చి సభ నలంకరించిరి. పిమ్మటఁ బార్వతీపరమేశ్వరు లగ్రపీఠముల నధివసించిరి. చిత్రరథుండును భార్యయు నిరుగడల నిలిచి వింజామరలు వీచుచుండిరి.

నవరత్న ఖచితమై యద్భుతతంత్రీకలితమైన మహతియను విణారత్న మొకండెత్తుపీఠంబున మెఱయుచున్నది. అదియే పార్వతీనిర్మితమగు విపంచియని యెల్లరువిస్మయముతోఁ జూచుచుండిరి. సభ యంతయు నిండినపిమ్మటఁ బార్వతీపతి యనుమతిని బృహస్పతి లేచి యెల్లరు విననిట్టుపన్యసించెను.