పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/318

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రోధనునికథ.

307

చెప్పుదును? అనియూరక యున్మత్తునివలెఁ బలుకుచు నాఁడుదానివలె గుండెలు బాదుకొనుచు వచింపఁదొడంగెను. మేమెంత జెప్పినను వినిపించుకొనడయ్యె. కొన్నిదినములు సముద్రముమీద బయనముజేసి మీజాడలు దెలిసికొని మీరు మృతినొందినట్లే ధ్రువపడి నంత నింతంతనరాని వంతతో వచ్చి యెవ్వరుజెప్పినను వినక నింటికిఁ బయన మగుటయు నేనతని భార్యగూడ వెంట నంపితిని. వారి మీ యింటం బ్రవేశ పెట్టి మాపరిజనులు తిరుగావచ్చిరని యావృత్తాంత మంతయు నెఱింగించెను.

ఆవార్తవిని విక్రముఁడు శోకవిహ్వలుఁడై మామా! మాసోదరుని పరిదేవనము వినిన నాగుండె పగిలిపోవుచున్నది. ఇంటికిఁ బోయి యీదుర్వార్త మాతల్లి కెఱింగించిన నామెయెంతచింతించు చున్నదో! వేగబోయి వారియార్తి యుడిగించి ప్రహర్షము గూర్చవలయు సెలవిండు పోయివత్తుమని పలుకుచు నటఁగదలి క్రమ్మఱ విమానమెక్కి, యక్కడి కథ లందున్నవారి కెఱింగించుచు నర్థదివసములోఁ గన్యాకుబ్జమునకు విమానముఁ బోఁజేసెను. అప్పు డందు శుద్ధాంతమున సౌభాగ్యసుందరి బిడ్డలు చుట్టునుం గూర్చుండి యూరడింపుచుండ,

ఉ. హా! సుకుమారులార! సుగుణైక నిధానములార! శత్రు సం
     త్రాసకరప్రతాప బలదర్పితులార! కుమారులార! మీ
     హాసవిలాసభాసుర ముఖాంబుజము ల్గన నాకు నింక న
     య్యో! సమకూరదా సుతవియోగభవార్తి భరింపనెట్లకో.

క. ఇదె వత్తురొ యదెవత్తురొ
    కద యని యెదురెదురుఁజూచి కాలముగడపన్
    దుద కిట్లు పిడుగుపడిన
    ట్ల దరఁగఁ జెడువార్త వినంగనయ్యెం గట్టా!