పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/313

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

300

కాశీమజిలీకథలు - పదియవభాగము.

మాన్యులుకారు. వానిప్రహారములు నామర్మముల వీడఁజేసినవి. ఇప్పుడు జయపత్రిక లిచ్చిన బోవుదురు.

క్రమ్మఱఁ బోరంజీరి మీరుగూడ నందోడితిరేని నారాజ్యమే కైకొందురేమో? యని పలికినవారు మీసములు దువ్వుచు నిట్లనిరి.

మహారాజా ! మాప్రతాప ప్రభావమెఱుంగకిట్లు పిఱికితనంబు వహించుచున్నావు. నిన్నిందుఁ గూర్చుండఁబెట్టి జయము గొందుము చూడుము మీసేనలతో యోధులతో మాకేమియుఁ బనిలేదు. మాగుఱ్ఱములఁ దెప్పింపుము. రేపు సూర్యోదయ సమయమే యుద్ధసమయమని వారికి వార్తనంపుము పరితపింపకుమని యుదుటు గరుపుచుం బలికిన నతండెట్ట కే యంగీకరించి యట్టివార్త మఠంబునకుఁ దెలియజేసెను.

మఱునాఁడు సూర్యోదయముకాక మున్న యావీరులేవురు గుఱ్ఱములెక్కి వీర వేషములతో రణభేరి మ్రోగ నామఠంబున కరిగిరి. క్రోధనుండింటికడనుండి చారుమతితో పట్టీ! వీరిసాహసములు వింతగా నున్నవి. వీరెవ్వని కుమారులు ? ఎట్టి బలవంతులు ? అని యడిగిన నాయువతి యిట్లనియె.

బాబా! వీరు తాళధ్వజుఁడను మహారాజు కుమారులు ఉత్తరదిగ్విజయము జేయ బయలుదేరి యెల్లభూపతులను జయించి కప్పములు గొన్న మహాశూరులు నన్నెత్తికొని పోయిన మధుండను దానవుని బరిమార్చిన యోధులు వీరే! ఇట్టియసహాయ శూరు లెందును లేరని చెప్పిన విని యతండు. ఏమీ వీరు తాళధ్వజుని కుమారులా! నాశత్రువు గూడ దాళధ్వజుని కుమారులమని చెప్పిన జ్ఞాపక మున్నది. వీరును వారు నన్నదమ్ములు గారు గద. అని యడిగిన నవ్వెలఁది తెల తెల పోవుచు గావచ్చును. తాళధ్వజుని కుమారులు ఇరువదిమంది పెద్ద వారేవురు పూర్వదిక్కు జయించుకొని వచ్చిరఁట.