పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/310

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రోధనునికథ.

297

నం దంతగా నైపుణ్యమున్నట్లు తోచదు. పోనీ, ముష్టి యుద్ధము చేయుదమా? లేక శరశరాసనంబులం బూని ద్వంద్వయుద్ధము చేయుదమా ? నీ కేది ప్రియమో చెప్పుము. అన్నిటియందు నిట్టిప్రజ్ఞయే కలిగియున్నచో దొలంగిపొమ్ము. జితోస్మియని నాకాలిక్రింద దూఱి పొమ్ము. అని పలుకుచుండ విని యతండు దోస్సారము క్షీణించి నను రోషావేశంబున లేనిబలము దెచ్చుకొని యొక్క పెట్ట విక్రముని మీఁది కుఱికి ముష్టియుధ్ధంబునకుఁ దొడంగెను. అప్పుడు వారిద్దరు పెద్దతడవు బాహాబాహీ ముష్టాముష్టి కచాకచిం బెనంగుచుఁ జూపఱకు వెఱపుఁ గలుగజేసిరి.

విక్రముం డట్లొక్కింతసేపు విలాసముగాఁ నతనితోఁబోరి బెండువడియున్న యతని నట్టె యెత్తి నేలం బడద్రొబ్బి బెబ్బులి మేక పిల్లనుం బోలె నవలీలం బొదివి పట్టుకొని యిట్టట్టు కదలనీయక మోకాళ్ల నొక్కి పట్టుటయు నామహారాజు,

క. చచ్చితిఁ జచ్చితి నయయో
   నొచ్చెనొడల్ నిలువ లేననూనవ్యధకున్
   మెచ్చితి నీబలమున కిదె
   యిచ్చెదఁ బత్రికల విడువుమిఁక నన్న నఘా !

అని గిలగిలం గొట్టుకొనుచుఁ బలికిన విని యాయుద్ధము జూచుచున్న రాజపత్ని యడలుచు నందువచ్చి మహాత్ములారా ! మీరు దేవసములు లోకైకవీరులు. కానిచో ననేకయంత్ర దుర్గరక్షితంబగు నీనగరంబు జేరఁగలరా ! హఠాత్తుగా భోజనమునకుఁ బిలిచిన నరపతి పయింబడి భోజనశాలయే రణభూమిగాఁజేసి పరాభవించుట వీర ధర్మముగాదు. మీకడ నేను రణధర్మములు సెప్పుదాననా? ఎట్లైన నేమి ? మీరు నానాధుని జయించితిరి. పతిబిక్షబెట్టి వీనిని రక్షింపుఁడని వేడుకొనినది.