పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/31

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

కాశీమజిలీకథలు - పదియవభాగము.

గీ. రమణి! గంధర్వకులభర్త రత్న కేతు
   నందనుండఁట యట్టిగానప్రశస్తి
   యెందునేర్చెనో దేశికుండెవఁడొవాని
   కహహ! తత్కల్పితము లగమ్యములుసూవె.

అరవింద - అయ్యో! గానవిద్యా మహామహోపాధ్యాయులైన మీరే యిట్లు మెచ్చుకొనుచుండ నగ్గంధర్వకుమారుని గాన పాండిత్యం బనన్యసామాన్యమని తెలియఁబడుచున్నది. అతనిపేరు పట్టికలో వినియుంటి మిక్కిలి చక్కనివాఁడనియు హరిభక్తుండనియుం జెప్పిరి. కాని సంగీతములో నింతవాఁడని యెవ్వరును దెలిపి యుండలేదు.

తుంబురు—త్రిలోకమోహజనక రూపుఁడగుఁగాక. హరిభక్తుఁడగుఁగాక దాన మన కేమి? అట్టియద్భుత గాన కౌసల్యమెట్లునేర్చెనో తెలియదు. నిన్న నొక్కగీతముపాడి తన ప్రావీణ్యము తెలియఁ జేసెను. నేడెంత ప్రగల్భముజూపునో తెలియదు కానిమ్ము వేళ యగుచున్నది.

నీవీ వీణఁబట్టించుకొని సభకుఁబొమ్ము. రాజపుత్రికలు నాకై వేచి యుందురు వారిందోడ్కొని వచ్చెద.

అని తుంబురుఁడు శిష్యరాలగు నరవిందకు నియమించి తాను రాజపుత్రికలయంతఃపురమున కరగెను. అప్పుడు చిత్రరథునికూఁతురు మాలావతి చెల్లెండ్రతోఁగూడికొని యుపబర్హణుఁడు పాడినస్వర విశేషంబులఁ బాడఁ బ్రయత్నించుచుండెను. అలవడినవికావు. అంతలో సంగీతోపాధ్యాయుఁడు తుంబురుఁడు వచ్చెననువార్త విని సంతోషముతో నార్యా! నిన్న నాగంధర్వకుమారుఁడుచేసిన స్వరకల్పనలెట్టివో యని విమర్శింపఁజేతగాకున్నవి. ఆమెలకువ మా కెఱింగింతురా ! అతఁ డేపాటి గట్టివాఁడు? అని యడిగినఁ దుంబురుఁ డిట్లనియె.