పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/307

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

294

కాశీమజిలీకథలు - పదియవభాగము.

ఉ. సంగర బిక్షబెట్టుమని సాహసమొప్ప వచించినార లు
     ప్పొంగితి నొక్కరొక్కరుగఁ బోరొనరింపఁగనేల నందఱేకమై
     నం గుతుకంబె నా కమరనాధ సుతుండొకఁడేకదా బలా
     ప్తింగురునాధులం గెలిచి త్రిప్పఁడెగోవుల మీరెఱుంగరే.

అనిపలికిన విని యారాజనందనలు మందహాసశోభిత వదనారవిందులై

క. ఓనృప! తాళధ్వజనృపు
   సూనుల మేమిప్పురంబు జొచ్చితి మురు వి
   ద్యా నిపుణతతో శత్రు
   స్థాన రహస్యములఁ దెలియఁదగు ఛద్మమునన్ .

యంత్రబలగుప్తుండవగు నిన్నుఁ దంత్రబల ప్రౌఢిమం బట్టికొనుట తప్పుగాదు. లే లెమ్ము. ఆయుధఁబులం ధరింపుము. నీధార్మిక బుద్ధికి మెచ్చుకొంటి. అన్నంబిడఁబూనిన నీపైఁ గత్తిగట్టితి మిదక్షత్రియధర్మంబగుట దూష్యంబుగాదు. జితోస్మి యనుము. విడుతుమని పలికిన విని క్రోధనుం డిట్లనియె.

ఓ హో హో! మీ బాహుబలం బెట్టిదైనను వచనప్రౌఢిమ మెచ్చఁదగి యున్నది. వాచాలురగుదురు. దొంగలవలె నింటిలో దూఱి బీరము లాడెదరా? కానిండు. మిమ్ముఁ బరిభవించి మీవాక్యములకు సమాధానము చెప్పెదంగాక. అని పలుకుచు నసిగదా ముసలాది సాధనంబుల నక్కడికిఁ దెప్పించుకొని వారిపై దుముకుటయు నతనితో విక్రముం డొక్కఁడే కలియఁబడెను. తక్కినవారు వారి యుద్ధనైపుణ్యము బరికించుచు దూరమున నిలువఁబడిరి.

అంతకుమున్న యంతఃపురకాంత లందఱు నయ్యతిపతుల నర్చించుటకై స్నానముజేసి పీతాంబరంబులం దాల్చి పుష్పంబులు చేతఁబూని ప్రాంతములం బొంచి పొంచి చూచుచుండిరి. రాజపత్ని యతిభక్తితో వంటజేసి వడ్డింపఁ నిరీక్షించుచున్నది. అట్టిసమయంబును