పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/301

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

288

కాశీమజిలీకథలు - పదియవభాగము.

ప్రేయసీ! ఈవిమానము కామగమనమనముకలదిగదా! దీనినిప్పుడు వరుణావతీనగరమునకుఁ బోవునట్లు స్మరింపవలయును. రాత్రివేళ మమ్మందు దింపి మీరు స్వర్గమునకుఁ బొండు మేము స్మరించినప్పుడు తిరుగా రండు. మీయందు మాకు నమ్మకము గలిగినది. మే మాక్రోధనుని జయించినపిమ్మట మనమందరము గలిసి విమానమెక్కి మానగరమున కరుగుదముగాక. అని యుపదేశించిన వినిమధుమతి యంగీకరించి వారు కోరినరీతిగాఁ దెల్లవారుసమయమునకు నా విమానము వరుణావతీనగరము జేరునట్లుజేసి యావీటి నడివీధి వారిం దింపి విమానముతో స్వర్గమునకుఁ బోయెను.

క్రోధనుఁడు భూపతులనిన నిరసించును. యతులనిన నతిభక్తితోఁ బూజించును. ఆవార్త వారదివఱకే వినియున్న వారగుట నప్పుడే యతివేషములువైచికొని సూర్యోదయము కాఁగానేమఠమెక్కడనున్నదని యడిగి తెలిసికొని సన్యాసులువసించు శంకరమఠమున కరిగిరి.

మఠాధిపతులు వారిరాకజూచి యెదురువచ్చి సగౌరవముగాఁ దోడ్కొనిపోయి తగిననెలవునఁ బ్రవేశపెట్టి మ్రొక్కుచు నిట్లనిరి. మహాత్ములారా ! మీ రెందుండివచ్చితిరి. ఇందెన్నాళ్లుందురు! మీ రేయేదేశములు తిరిగితిరి? మీవృత్తాంత మొకింత యెఱింగించితిరేని వ్రాసికొని మారాజునకుఁ దెలియఁ జేయవలసి యున్నది. మీరెంత కాల మిందుండినను నభ్యంతరములేదు. మీకుఁ గావలసిన పదార్థముల నర్పింపుచుందుము. ఇది మారాజశాసనము అని యడిగిన విని విక్రముఁడు ఇంచుక నవ్వుచు నిట్లనియె.

మీయధిపతి యతిప్రియుండనియు విద్యాబలసంపన్నుండనియు విని చూడవచ్చితిమి. ఇందలివారలకు యతిధర్మములేమియుం దెలియవనుకొందుము. మాకాహారముతోఁ బనిలేదు. నారాయణస్మరణము. అద్వైతచింతనము తప్ప నితరవిషయములుమా చెవి కెక్కవు.