పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/298

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రోధనునికథ.

285

లిచ్చినదఁట అందులకై యాలస్యమైనదని చెప్పిరి. అని యెఱింగించిన నింద్రుండు;

ఓహో! గాయత్రిదేవియే వారికిఁ బ్రత్యక్షమైనదియా ఎట్టి వరము లిచ్చినది? అనుటయు నావరము వివరము మాకుఁ దెలియదని వాండ్రు చెప్పిరి. వెంటనే మమ్ముఁ రమ్మని యాజ్ఞాపించుటయు దూతలు వచ్చి మమ్ముఁ దోడ్కొని పోయిరి.

ఇంద్రుఁడు - (మా నమస్కారములందుకొని) చంద్రకళా ! ప్రతి శుక్రవారము గాయత్రిదేవి నారాధించుటకు భూలోకమున రుగుచుంటిరఁట ఏమిటికి?

చంద్రకళ — (సిగ్గభినయించుచు) బృహస్పతిగారు మమ్మట్లు పోయి సేవించమన్నారు.

ఇంద్రుఁడు — ఎందులకై సేవించమన్నారు?

చంద్ర - ఏమియు మాటాడినది కాదు

ఇంద్రుఁడు — వారుణీ! నీవు చెప్పుము

వారుణి — మీకు మంచి యల్లుఁడు వచ్చుటకు

ఇంద్రుఁడు - గాయత్రీదేవి ప్రత్యక్ష మైనదియా? వరము లిచ్చినదా?

వారుణి – ఆ ప్రత్యక్షమై వరములిచ్చినది.

ఇంద్రుఁడు - ప్రత్యక్ష మైనదా? తిన్నఁగాఁ జెప్పుము

వారుణి — తిన్నగానే చెప్పితిని.

ఇంద్రుఁడు — ఎట్టి వరము లిచ్చినది?

వారుణి – మేము కోరిన వరము లిచ్చినది.

ఇంద్రుఁడు - మీరు భర్తలంగోరి సేవించితిరి గదా భర్తల నిచ్చినదియా?

వారుణి – ఇచ్చినది స్వామి యసత్యమాడుదుమా?