పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/293

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

237 వ మజిలీ.

క్రోధనునికథ.

గాయత్రీదేవి యాలయముగల దీవికి శక్తి ద్వీపమనిపేరు. ఆదీవి నాలుగుమూలల నాలుగు శక్తి దేవళములు గలిగియున్నవి. నడుమ గాయత్రీయాలయమొప్పుచున్నది. ఆదీవికడుచిన్నది. వరుణ ద్వీపమునకు దక్షిణ సముద్రమునంటియున్నది. అద్వీపముచేరిన వారిని మహాశక్తులు మ్రింగివేయునని వాడుక యుండుటచే మనుష్యులెవ్వరు నాద్వీపమునకు నోడలఁ జేర్పరు. సముద్రములోఁ బోవునప్పుడుకూడ నాదీవికిఁ జేరకుండ దూరము నుండి నడిపించుచుందురు.

దానంజేసి యాదీవి మిగుల రహస్యస్థలమై యొప్పుచున్నది. తాళధ్వజుని పుత్రులు నలువురు దేవకాంతలతో నాలుగుదెసల నతి విచిత్రప్రచారముల నతిమనోహర కేళీవిలాసముల నపూర్వ కామక్రీడా వినోదముల నిదిరాత్రి యిది పగలను వివక్షలేక నెలదినము లొక గడియగా వెళ్ళించిరి.

ఒకనాఁడు విక్రముఁడు మధుమతితో, ప్రేయసీ! మాచరిత్ర మంతయు నీకెఱింగించితిమిగదా? మాపూర్వపుణ్యవిశేషంబున మా యన్నలవలె దేవకాంతల మిమ్ము భార్యలుగ బడసితిమి. మీకేళీవిలాసముల జొక్కి వచ్చినపని మఱచితిమి. వరుణావతీ పురాధీశ్వరుఁడు క్రోధనుం జయించినంగాని యింటికిఁ బోవరాదు. అట్లు పోయితిమేని యుమాపురంబుననున్న రాజకుమారులు మమ్ముఁ బరిహసింపకమానరు. మేము శపధములుసేసి వచ్చితిమి. శత్రునగరముచుట్టును యంత్రము లమరించియుంచిరఁట. సముద్రములో నాగనులుతగిలియేకాదా మాయోడలు శకలములైనవి. మెట్టదారిని గూడ నావీడుచేరుట కష్టమఁట. ఆకాశగమనంబున నప్పురము జేరవలసియున్నది. వానికి