పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/292

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సావిత్రికథ.

279

సాధ్వులారా! మాకథ చాలపెద్దది. ముందు వివరింతుముగాక యీమహాదేవికృపవలననే మేమిందు వచ్చుటకుఁ గారణమైనది. మనకుసంఘటన మీమెయేచేసినదని తత్సమయోచితములైన మాటలచేత నతండు వారికి సమ్మోదము గలుగఁ జేసెను.

అని యెఱిఁగించుటయు ముసిముసినగవులు నవ్వుచు గోపాలుండు స్వామీ! యిందు గాయత్రీమహాదేవి మాహాత్మ్యమేమియు నాకుదెలియఁబడలేదు. మాయూరిగుడిలోనున్న యమ్మవారువలె గాయత్రియు నాగుడిలోనుండుటయేకాని వారి కేమిసహాయము జేసినదియో చెప్పుడు. అమ్మవారి మహిమవలనఁ దమకాపతులు లభించిరని దేవకాంతలును గట్టెక్కితిమని రాజపుత్రులును సంతోషించు చున్నారు. నిజమరయ నందులకు నిందులకుఁగూడ నీమె యేమియుఁ గారణముకాలేదు. కాకతాళీయముగా రాజపుత్రులందుఁజేరి వారి మాటలు వినుటచేఁ గపటంబున నట్టి వేషంబులు వైచి వారిని మోసముజేసిరి కాదా! అని యడిగిన నవ్వుచు నయ్యవా రిట్లనియె.

ఓరీ! గాయత్రీమహాదేవిం దూఱితివికావున లెంపలువాయించుకో. అమ్మహాదేవికరుణావిశేషంబునం గాక యట్టినంఘటన మెట్లగును? ఆమె భక్తులకుఁ బ్రత్యక్షముగాదు కామ్యములు తీర్చునని నీ కదివఱకే చెప్పియుంటిని. అద్దేవి దయచేఁ గాక సముద్రమధ్యంబునం బడినవారు దరిజేరఁగలరా? ఆసేనలలో నొక్కరైనబ్రతికిరా? గాయత్రి దా నేమియు నెఱుఁగనట్లేయుండి సేవించిన వారికార్యంబులఁ దీర్చునని దేవీమహాత్మ్యము పెద్దగా వివరించి శిష్యునకు సంతోషము గలుగఁజేయుచు నవ్వలికథ పైమజిలీయం దిట్లు. . . చెప్పుచుండెను.


__________