పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/291

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

278

కాశీమజిలీకథలు - పదియవభాగము.

అక్కాంతల ప్రార్థనా వాక్యంబుల విని రాజ పుత్రులు వారికి దమయెడఁ గలుగు గౌరవప్రతిపత్తులం దెలిసికొని సంతసించుచు గాంతలారా ! మీరెవ్వరు ! ఈ యేకాంత ప్రదేశమున కెట్టువచ్చితిరి?" మమ్మువరించిన మీ కులశీలనామంబులఁ దెలిసికొనుట మాకావశ్యక మైన పనికాదే యని యడిగిన మధుమతియిట్లనియె.

ఆర్యులారా ! నేనింద్రుని కూఁతురను ప్రభావతియను నచ్చర యందు జనించితి నిది యముని పుత్రిక యది వరుణునిపట్టి యిది కుబేరనందని. మా నలువుర తల్లులు నచ్చరలగుట మేము జనించినది మొదలొక్క చోటనే పెరిగితిమి. ఆహార నిద్రా విహారాదుల నొక్క గడియైన విడిచియుండఁజూలము మేముక్రమంబునఁ బెరిగి యౌవనవతులమై యతిగుణాన్వితులగు పతులంబడయఁదగు వ్రతముపదేశింపు మని యొకనాడు బృహస్పతికడకరిగి యడిగితిమి. ఆసురగురుండించుక యాలోచించి భూలోకమున శక్తిద్వీపమున గాయత్రీమహాదేవి క్షేత్రమున్నది. ప్రతిశుక్రవారము రాత్రియందుఁబోయి జాగరముండి యాదేవి నారాధించుచుండ నాఱుసంవత్సరములకు వ్రతము బూర్తి యగు. చిట్టచివరశుక్రవారమునాఁడు మీ కామిత మా దేవత యీడేర్చునని యుపదేశించెను.

మేమాగురువచనంబు గురువచనంబుగాఁదలంచి తదుపదేశప్రకారము వరుస దప్పకుండ నాఱువత్సరములనుండి యీదేవి నారాధింపుచుంటిమి. నేఁటికి మావ్రతము పూర్తియైనది. అమ్మవారు మిమ్ముఁ బతులగా దయచేసినది. మేము కృతకృత్యులమైతిమి. ఇఁక మేము మీయిష్టమువచ్చినట్లు మెలంగువారము. మీరు మాతో యధేష్టసుఖంబులనుభవింపవచ్చును. మీయిచ్చవచ్చినచోటునకు మేమువచ్చెదము. మీవృత్తాంతముకూడ నెఱంగించి మాకు శ్రోత్రానందము గావింపుఁడని వేడుకొనిన విక్రముండిట్లనియె.