పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/288

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సావిత్రికథ.

275

అమృతపానము జేసినట్లుగా వారికిఁగూడ క్షుత్పిపాసలునశించినవి. పిమ్మట నతండందొకచో గూర్చుండబెట్టి సోదరులకు దేవకాంతా గమన వృత్తాంతము జెప్పుచు వారందుంచిన వస్త్రమాల్యాను లేపనాదులఁ జూపించెను. వాటిని వా రక్కజముతో విలోకింపుచుండ విక్రముండు తమ్ములారా ! వీని మనము ధరింతము దేవకాంతలు రేపు శుక్రవారము రాఁగలరు అప్పటి మన యదృష్ట మెట్లుండునో యట్లు జరగును. అని యుపదేశించుటయు వా రేకవస్త్రులై యున్న వారగుట సంతోషముతో నా కనకాంబరములుదాల్చి మణిహారకటకాంగుళీయాదికముల నలంకరించుకొని మందారదామంబు లురమున వై చుకొని దివ్యరూపములతోఁ బ్రకాశించుచుండిరి.

ఆరాజకుమారులు నలువురు నత్యంత భయభక్తి విశ్వాసములతో నియమితచిత్తులై మూఁడు దివసములా కోవెల ముఖ మంటపమున గూర్చుండి గాయత్రి మంత్రోపాసన గావించిరి.

శుక్రవారమునాఁడు సూర్యోదయమైనది మొదలు రాజకుమారుల చిత్తములు సంభ్రమాభివ్యక్తములై యెప్పుడు ప్రొద్దుగ్రుంకు నెప్పుడు దేవకాంతలం జూతుమని యుఱ్ఱూట లూగుచుండెను. వారికి నాఁ డెంతసేపటికిఁ బ్రొద్దు క్రుంకునట్లులేదు. సంతతము నాకసము వంకేచూచుచుందురు. ఎట్ట కే సూర్యాస్తమయమైనది. తారకాభర్త నక్షత్రముల నడుమ పూగుత్తియవలెవారి కాహ్లాదము గలుగఁజేసెను.

అప్పుడు వారు తటాకంబున మునుంగులాడి తమమేనులు దివ్యగంధమాల్యానులేపనాదుల నమరఁ జేసి నూత్నాంబర భూషా విశేషంబుల నలంకరించుకొని తదాగమన మభిలషించుచుండిరి.

దేవకాంతలును వల్లభ సమాగమాభిలాషంజేసినాఁడు వింతగా గై సేసికొని పెందలకడ బయలుదేరి మాటలాడికొనుచు నాయాలయ ప్రావరణములోఁ దిగిరి.