పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/287

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

274

కాశీమజిలీకథలు - పదియవభాగము.

బునంబడిన మనలను గట్టుజేర్చిన భగవంతుని సంకల్పమెట్లో యట్లు జరగక మానదు. ఇందు మీ కొకవిశేషము జూపెదరండు మీరు పడిన యిడుములు మఱచిపోవుదురని పలుకుచుఁ దా నా గట్టెక్కినది మొదలు నాఁటి తుదివఱకు జరిగిన చర్య యంతయుం దెలువుచు నాదారిని వారినమ్మవారి కోవెల ప్రాంతమునకు దీసికొని పోయెను.

కాంచనసముద్దీప్తంబులగు నా యాలయ ప్రాకార గోపురమంటపాదులంజూచి యాశ్చర్యమందుచు నిట్టిదివ్యక్షేత్రంబున్నదని యెఱింగిన జనులు రాకుందురా! ఇది దేవతాభూమి మన పూర్వ పుణ్యవిశేషంబున దీనింజేరితిమని సంతసించుచు నందలి విశేషంబులంజూపింపుమని విక్రమునింగోరికనుటయు నతండు సోదరులఁ దటాకమునకుఁ దీసికొని పోయెను. వారు తత్తోయ పరిమళ విశేషమున కుబ్బి గంతులువైచుచు విక్రమా! నిన్న మాకుఁదెచ్చిన నీరీ కోనేటిలోనిదే కాఁబోలు. ఈ రహస్య క్షేత్రమును నీ వెట్లు పొడగంటివో వింతగానున్నది. అనుటయు నతండు ఇది నాప్రజ్ఞగాదు. భగవంతుఁడే దీనింజూపించె వేగమిందు గ్రుంకులు వెట్టుఁడు దేవీదర్శనము గావింతమని తొందర పెట్టెను.

పిమ్మట వారందఱు నందు తీర్థములాడియాడి వార్చి యెట్ట కే గట్టెక్కి తడిపుట్టంబులం బిండికొనుచు నా యాలయముచుట్టు ప్రదక్షిణములుజేసి తలుపులు తెరచికొని లోపలకుఁ బోయిరి. విక్రముఁడు సోదరులకు గాయత్రీ మహాదేవింజూపుచు నీ యంబ యెవ్వరోఁ యెఱింగితిరా? వేదములఁ గన్నతల్లి గాయత్రి మనపాలింటి కిప్పుడు కల్పవల్లియైనది. ఈమె కృపచేతనే మన మిందుఁజేరితిమి. ఇమ్మహా పరదేవత నారాధింపుఁడని పలుకుచు సోదరులతోఁగూడ నానందబరవశుండై గాయత్రిదేవినిఁ పోడశోపచారములచేఁ బూజించి పెద్దగా నగ్గించెను.