పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/286

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సావిత్రికథ.

273

జలధిపాలైపోయినదిగదా! నే నాయోడ గుభాలున చప్పుడై మునిఁగినతోడనే సముద్రములోఁ బడిపోయితిని. చేతి కేమియు నాధారము దొరకలేదు. పెద్దతడ వీదితిని. ఆయాసము గలిగినది ఇఁక మునిఁగి పోవుదునని తలంచుచు దేహముపై నిరాశజేసికొని పరమేశ్వరిని ధ్యానించితిని. ఇంకను జీఁకటిగానేయున్నది. నాప్రక్కనే యొక్క పెద్దదారువు కొట్టికొనివచ్చుచున్నది. అది నాచేతికి దొరికినది. అది చిన్నదోనెవలెనే గుండ్రనై యున్నది. దానిపై కెక్కితిని మునుఁగలేదు. తమ్ములిద్దరు దానిమీఁద నున్నారని నాకుఁ తెలియదు. దానినంటి విడువకుంటిని. రెండుదివసములు చెరుపుమఱుపులతో నుంటిని. తరువాత స్మృతిదప్పినది. ఇక్కడికెట్లువచ్చి గట్టెక్కితినో తెలియదని విజయుఁడు తనకథ నెఱింగించెను.

తక్కిన యిరువురుగూడ నట్లేకొంతసేపు సముద్రములో మునిఁగి యాకొయ్య యాధారముదొరకగా నెక్కితిమని చెప్పిరి. ఆ తెరచాపకొయ్య మిక్కిలిపొడవుగాను లావుగానుండుటచే నొండొరు లున్నవార్త తెలియకయే కొట్టుకొనివచ్చిరి. ఆస్థంభమే వారికిదైవమై తీరమును జేర్చినది. వారునలువు రారాత్రి యిష్టాలాపములాడు కొనుచు నాతీరమునందే శయినించిరి. మఱునాఁడుదయమున లేచిన పిమ్మట విజయుఁడు విక్రమా! ఇప్పుడు మన మేమిచేయదగినది? ఇది యే దీవియో తెలియదు. ఇందు మనుష్యసంచారము లేకపోవుట వింతగానేయున్నది. ఇది వరుణద్వీపమైనచో జనులుండక పోవుదురా! శ్రీధరుఁడు జెప్పినమాట వినక మనమిట్లు బయలుదేరుట చాల తప్పు. మనతో వచ్చిన యోడలన్నియు మునిఁగిపోయినవి. శ్రీముఖునకు మన వార్త దెలియదు. క్రోధనుని జయించుమాట దేవుఁడెఱఁగు. మనమీ సముద్రముదాటి యింటికిఁబోవుటెట్లని యడిగిన నతం డిట్లనియె.

అన్నా ! మీరు పిఱికితనము వహింపవలదు. సముద్ర మధ్యం