పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/285

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

272

కాశీమజిలీకథలు - పదియవభాగము.

తెరఁవుడని పలుకుచు గొంచమునీరు ద్రావించెను. ఇంచుక తెలివి గలిగినది. కన్ను లెత్తి చూచిరి అప్పుడు వారి నాదారువునుండి లేవదీసి మెల్లగా నాదారువునకు జేరఁబడి కూర్చుండబెట్టి యాప్రాంతమునకుఁ బరుగెత్తికొనిపోయి వెలగపండ్లం గోసికొనివచ్చి వానిగుంజు మెల్లగా నోటికందిచ్చి తినిపించెను.

ఆరస మొకింత నొంటబట్టినతోడనే వారు లెస్సగాఁ జూచుచు నొండొరులఁ బరికించుకొనివిక్రమునితో నెలుగురాక మఱికొన్ని వెలగపండ్ల తినిపించుమని సంజ్ఞచేసిరి. అతండు కడుపునిండ వెలగ పండ్లదెచ్చి తినిపించెను. దప్పిదీర నీరుద్రావించెను. అన్నాతురులకు రుచియుఁ బక్వము గావలయునా? యెట్లో కడుపునిండించుటయే పని.

విక్రముఁడు తనయుపవస్త్రముమార్చి వారి పుట్టంబులు విప్పించి యుదికి యారవైచి కట్టించి సోదరులారా! మీకుదగిన పానీయము దీసికొనివచ్చెద. దానిం గ్రోలితిరేనిక్షుత్పిపాసలుండవు. నాలుగుగడియలలో వచ్చెద నిందుఁ బండుకొనియుండుడని పలికి యప్పుడే యమ్మవారి యాలయముకడకువచ్చి గర్భాలయములోనున్న అభిషేకఘటంబు గైకొని యమ్మవారికి మ్రొక్కుచు దానినిండనీరు వట్టి యావరణలోనున్న నారంగఫలములఁ గొన్ని గోసికొని యతివేగముగా వారికడకుఁ బోయెను.

అప్పటికి వారికిఁ గొంచెము బలముకలిగి యొండొరులఁ బలకరించుకొనుచున్నారు. విక్రముఁడు నారంగఫలముల రసముపిండి వారిచే గ్రోలింపఁ జేసెను. తటాకతోయము ద్రాగించెను. అమృత పానముజేసినట్లు వారికి శరీరములో మిక్కిలిబలము గలిగినది.

విజయుఁడు విక్రమునితోఁ దమ్ముఁడా! నీవెక్కినయోడమునుఁ గలేదాయేమి ? నిన్నుఁజూడ సముద్రములోఁబడనట్లు కనంబడుచుంటివి. మేమెట్లు గట్టుచేరితిమో తెలియదు. మనప్రయత్న మంతయు