పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/283

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

270

కాశీమజిలీకథలు - పదియవభాగము.

నావలెనే మాసోదరులుగూడ నేదేని యూతబూని గట్టుచేరరాదా. ఏమో దైవసంకల్ప మెవ్వరికిం దెలియదు. నేనాసముద్రతీరమునకుం బోయి వారిజాడ సరసెదంగాక కలగాని నిజముగాని ఇప్పుడక్కార్యమే కర్తవ్యమని తలంచి ద్వారపాలికాముష్టిఘటితమగు చంద్రహాస మూడబెరికి చేతంబూని సముద్రముదెసకుఁ బోవుచు నాకరవాలంబునఁ గంటకలతాగుల్మాదుల ఖండించి దారిచేయుచు మధ్యాహ్నమున కా సముద్రతీరము జేరెను. అప్పుడత్తీరమునుండి యమ్మవారిగుడి దాక చక్క నిమార్గ మేర్పడినది.

అతండు సముద్రముదెస పరికించుచు సాయంకాలముదనుక నాతీరమునఁ దిరుగుచుండెను. వికలములైన యోడశకలము లక్క డక్కడ నొడ్డునఁ జేరబడియున్నవి. వానిని విమర్శించుచు నామూల నుండియీమూల కూరక సంచారము చేయుచుండెను. అతనికిఁ దటాక జలంబులు గ్రోలినదిమొదలు క్షుత్పిపాసలు నశించినవి. దానంజేసి యతం డా రాత్రి యాతీరమునందే వసించి తొల్లి దక్షిణాబుంధితీరంబున దర్భలపై శయనించిన శ్రీ రాముండునోలె సభీష్టసిద్ధికై గాయత్రీ మహాదేవిని ధ్యానించుచుండెను.

వేకువజామున నతనికించుక నిద్రబట్టినది. అందుఁ దనసోదరులు తీరముజేరి తనతో మాట్లాడుచున్నట్లు కలవచ్చుటయు నదరిపడిలేచి నలుమూలలుచూచెను. అప్పుడరుణోదయమగు చున్నది. ఇదికలలోఁ గలకాఁబోలు. నాకట్టి భాగ్యముపట్టునాయని తలపోసి యట్టలేచి యేమియుం దోచక సముద్రపుగట్టునే యుత్తరముగా నడువఁజొచ్చెను. అది పాటుసమయమగుట సముద్రము కొంత లోపలకుఁ బోయినది. అందందుఁ జిక్కియున్న జల జంతువు లతనిరాకజూచి తటాలున బొరియలలోఁ దూరుచుండెను. ముత్తెపుచిప్పలు నత్తగుల్లలు పరాటికలు ప్రోగులుగానుండి యతని పాదములకు గ్రుచ్చికొనుచుండెను.