పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/279

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

266

కాశీమజిలీకథలు - పదియవభాగము.

పాణిగ్రహణమంత్రములు జదువుచుండ సుముఖునకు గుణ కేశినినిచ్చి కన్యాదానము గావించెను. వధూవరులు విచ్చలవిడి నతిసంతోషముతోఁ దలబ్రాలుబోసికొనుచుండిరి. అట్టిసమయంబున నొకమూల దుందుభిధ్వనులంగప్పిన గొప్పచప్పుడు లుప్పతిల్లుటయు నెల్లరు నావంకఁ జూచుచుండిరి. అంతలో ద్వారపాలురువచ్చి గరుత్మంతుఁడు వచ్చుచున్నాఁడని తెలియఁజేసిరి. అప్పుడు మహేంద్రుఁ డుపేంద్రునితో స్వామీ! గరుఁడుఁడు వచ్చుచున్నాడఁట సుముఖు నెట్లు కాపాడెదరో యని తెలియజేసెను. అంతలో ఱెక్కలుముడిచికొనుచు వైనతేయుం డాకళ్యాణమంటపసమీపమునకు వచ్చి వ్రాలెను. అతనిరాక జూచి సుముఖు డదరిపడి పెండ్లిపీటలమీఁదనుండి లేచి లోపలకుఁ బారిపోయెను. ఆర్యకుఁడు చుట్టములతోఁగూడ వివరము లరసి డాగి కొనియెను. అప్పుడు పక్షీంద్రుం డుపేంద్రునకు నమస్కరించుచు మహేంద్రు నుద్దేశించి యిట్లనియె.

వృత్తారీ! నీసారథి మాతలి నాకెట్టి యపకారము గావించెనో చూచితివా? సర్వ భూత ప్రభువగు విధాతచే నాకుఁ బాము లాహారముగాఁ జేయంబడినవి. భోగవతీపురంబున సుముఖుఁడను నాగ కుమారుని నేఁటి దిన మాహారవస్తువుగా నియమించుకొంటిని. నా నోటియన్నము పడఁగొట్టి యా పాఁపపట్టిందీసికొనివచ్చి యీ మాతలి పెండ్లికొడుకుఁగాజేసి నాఁడిది యేటి ధర్మము? నేను నియమితాహారముదప్ప మఱియొకటి భుజింపను నీకువలెనే స్వేచ్ఛావిహారములు నాకులేవు. మన యిరువురము కశ్యపుని బిడ్డలమైనను నీవు త్రిలోకాధిపతివైతివి. నే నొరులకుఁ బరిజనుడనైతినని నిరసింపరాదు. జుమీ? నేను నీకంటె బలవంతుఁ డనగుదును. శ్రుతసేన ప్రభృతి రాక్షసుల నేను వధించినవార్త నీవెఱుంగవా? వదలుము నాకాహార వస్తువైన సుముఖునిందు రప్పింపుము భక్షించి పోయెదనని యడిగిన