పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/272

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుణకేశినికథ.

259

మనుమఁ డతని మతికి ననుకూలుఁడని తోచెను. గుణకేశిని నీ మనుమని కీయ నంగీకరించినాఁడు. అందులకు మీకు గూడ సమ్మతమేని వెంటనే శుభకార్యము జరిగించవలసియున్నది. మీ కూటస్థుఁ డైరావతుని ప్రఖ్యాతినిబట్టి తనపట్టి సుముఖుని కీయ నిశ్చయించెను. ఇందులకు నీ యభిప్రాయమేమని యడిగిన నార్యకుండు నిట్టూర్పు నిగుడించుచు నిట్లనియె.

మహాత్మా! మాతలి చరిత్రము మేమెఱుంగనిదియా! అది యట్లుండె పరిజన కధలయందును దలంప నర్హతలేని మాయింటికి దేవర మాతలిందీసికొనివచ్చి మమ్ముఁ బెద్దగా నగ్గింపుచుంటిరి. ఇంతకన్న నాకుం గావలసిన దేమియున్నది! త్రిలోకాధిపతియగు మహేంద్రుని సచివుఁడువచ్చి పిల్ల నిత్తుమన్న వలదనువారుందురా? మునీంద్రా! మాయిక్కట్టు నేమనిచెప్పుకొందును. మాకట్టిభాగ్యము పట్టుటయెట్లు? స్వామీ! మాయూరినాగులెల్ల గరుత్మంతునికి వంతులు వైచికొని యాహార మర్పించుటకు నియమము జేసియున్నారు. క్రిందటినెలలో మాకు వంతురాగా నా కుమారుని జికురుని పక్షిపతి భక్షించిపోయెను. అంతటితో విడువక తండ్రి వెనుక నేడ్చుచు నందు వచ్చియున్న యీ సుముఖునింజూచి యోర్వఁజాలక యాపతగపతి ముందరినెలలో వీని నా కాహారముగాఁ దెచ్చియుంచుఁడని పాఁప పెద్దలకుఁ జెప్పిపోయెను. రెండు నెలలో నొక్క యింటివారి నిర్వుర భక్షింపఁగూడ దదియన్యాయమని యొక్క భుజంగుఁడు చెప్పఁడయ్యెను. సంవత్సరమునకొక యింటికి వంతు రాఁదగినది. రెండునెలలో వరుసగా మాయింటికివంతువచ్చినది. కొడుకు పోయినందులకే దుఃఖించుచుండ మనుమఁడుగూడ నానీడజపతికి భక్ష్యమైన నేమిచేయఁ దగినది? ఈయక్రమ మెవ్వరితోఁ జెప్పికొందును? అక్కడికిఁ పెద్ద నాగులకడకుఁబోయి మొఱపెట్టుకొంటిని. మేమేమి చేయుదుము?