పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/270

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుణకేశినికథ.

257

చుట్టను తిరుగుచుండిరి. ఆభోగవతీ నగరంబునంగల ప్రముఖులు తక్షకుఁడు కర్కోటకుఁడు కౌరవ్యుఁడు అశ్వతరుఁడు ఆర్యకుఁడు వసంతకుఁడు దిలీవుఁడు కాళీయుఁడు శంకుఁడు ధృతరాష్ట్రుఁడు లోనగు సర్పపుంగవు లెల్ల వచ్చి నారదుని గాన మాలించుచుండిరి. అట్టితరి నింద్రసారధి వారినెల్ల సాకూతముగా నాలోకింపుచుండెను.

చ. శిరమునఁజారు దివ్యమణి శేఖర మట్లు మెఱుంగు లీనఁగా
    సురచిర రత్నమండన విశోభితుఁడాది వయస్ఫురన్మనో
    హరతనుఁ డార్యలక్షణ సమంచితుఁడై తగునాగపుత్రుఁ డొ
    క్కరుఁడట నింద్ర సారధికిఁ గన్నులపండువు గాఁగనంబడెన్.

నూత్నయౌవన లావణ్య శోభా విభాసిత గాత్రుండగునట్టి నాగపుత్రుంగాంచి మాతలియుబ్బుచు గొబ్బున నారద మహర్షి తో మహాత్మా ! ఆ భుజంగ కుమారుండు ప్రణిధానమున ధైర్యమున రూపమున వయసున మాగుణ కేశినికిం దగినవాఁడు. మీ యనుగ్రహంబున నేఁటికిజూడఁ గంటి వానిజన్మ కర్మవిశేషములెట్టివో తెలిసికొనుఁడని కోరిన విని యయ్యనిమిషముని యా బాలునిఁ దననికటంబునకు రమ్మని చీరి యిట్లనియె.

నారదుఁడు — అబ్బాయా ! నీవెవ్వనికు కుమారుండవు?

సుముఖుఁడు -- (విచారముతో) నేను జికురుని కుమారుండ.

నార - నీపేరు.

సుము - సుముఖుండందురు.

నారదుడు - నీవు ఆర్యకుని పౌత్రుఁడవు కావా?

సుము - అవును.

నారదుడు - నీ మాతా మహుఁడు వామనుఁడేనా.

సుముఖు - చిత్తము వామనుఁడే

నారదుడు - నీతండ్రియుఁ దాతయు సేమముగానున్నారా ?