పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/27

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

కాశీమజిలీకథలు - పదియవభాగము.

ప్రేక్షకులు ప్రవాహమువలె వచ్చి చేరుచున్నారు. రాజధానియంతయు మంగళవాద్యములు మ్రోగుచున్నవి.

చిత్రరథుని మంత్రు లుపబర్హణుని రాక విని యెదురేగి సపరివారముగాఁ తీసికొనివచ్చి రాజబంధువుఁ డగుట రాజుపుత్రికలుండు గృహారామసౌధంబునఁ బ్రవేశపెట్టిరి. మఱియు,

సీ. కోరి ముప్పదిమూడు కోటులు వేలుపుల్
          భజియింప విచ్చేసె బలవిరోధి
    స్వాహా స్వధా వధూ సహితుఁడై వచ్చె మే
          షారూఢుఁ డగ్నిభట్టారకుండు
    కాలకన్యాది కింకర వర్గ మనుసరిం
          పఁగఁ జేరెఁ జారురూపమున యముఁడు
    గానశిక్షితులు కోటానఁగోటులు గొల్వఁ
          జనుదెంచె దానవచక్రవర్తి

గీ. వరుణుఁ డనిలునితోఁ గూడివచ్చె యక్ష
    భక్త విచ్చేసె నీశానుపజ్జ మఱియు
    నాగలోకమునుండి పన్నగులు శేష
    వాసుకి ప్రముఖులు వేడ్క వచ్చిరపుడు.

మఱియు నియమిత వాసరంబునకు,

గీ. ఇరుగడలఁ బార్షదులు బరాబరులు సేయ
    నందివాహనమెక్కి తా నగజతోడ
    వచ్చె శంకరుఁ డయ్యుత్సవమున కపుడు
    చిత్రరథుకోర్కె దీర నర్చింపఁబడఁగ.

చిత్రరథుండు బంధుమిత్ర పరివార యుక్తుండై పెద్దదూర మెదురేగి నమస్కారపూర్వక స్తుతివాక్యములతోఁ దూర్యనాదంబు లవార్యంబై యొప్ప నయ్యుమామహేశ్వరుల నాత్మీయ మందిరాభ్యంత