పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/269

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

256

కాశీమజిలీకథలు - పదియవభాగము.

అక్కా చెల్లెండ్ర బిడ్డలము. ఈమాత్రముపకారము చేయుము. అని వేడికొనిరి. వారిమాట తీసివేయలేక యాపక్షిపతి యట్లంగీకరించి యప్పుడే మరలిపోయెను.

నాఁటినుండియు మాకు సంఘ మరణములు తప్పినవి. వైన తేయుఁడు నెలకొకసారివచ్చి మేమిచ్చిన వారిలో నచ్చినవానింభక్షించి పోవుచుండును. దానంజేసి మాలో మాతగవులు గరుత్మంతుని మూలముగనే యడంగిపోయినవని యావృత్తాంతముంతయు నెఱింగించెను.

నారదుండు విని బాపురే! మీరు మంచి బుద్ధిమంతులు. అన్యోన్యమైత్రివలనఁ గలుగు సౌకర్యము లిట్టివేయని వారి నభినందించెను. అప్పుడు నాగకుమారులు ధనంజయప్రముఖులు నారదమహర్షి నగ్గింపుచు మహాత్మా! మేము మీ వీణాగానము విని చాలా కాలమైనది. ఒకసారిగాయత్రీసామము బాది మాకానందము గలుగఁ జేయుదురా? అని వేడికొనిరి. నారదమహర్షి వారి ప్రార్ధనమాదరించి యానడివీధినే కూర్చుండి విపంచి మేలగించి సామగానంబు హాయిగాఁ బాడఁజొచ్చెను. నారదమహర్షి సంగీతము పాడుచున్నారని విని భోగవతీనగరంబునంగల స్త్రీబాలవృద్ధులు గుంపులు గుంపులుగా వచ్చియాలకించుచునగ్గానరసము గ్రోలి వివశులై పడగలువిప్పి యాడఁదొడంగిరి.

అట్టితఱి నారదుఁడు జనాంతికముగా మాతలితో నీనిమిత్తమే నే నీసంగీతము పాడుచుంటిని. ఫణాధరులు గానమనినఁ జెవులుకోసికొందురు. ఇప్పుడీ గ్రామంబుననున్న నాగకుమారులందఱు నిందు వచ్చియున్నారు. వీరిలో నీకూఁతునకుఁ దగినవాఁడున్నాడేమోచూచికొనుము. మనము ప్రతిపన్నగుని యింటికింబోయి చూచినచోఁ బెద్ద కాలముపట్టును. పరీక్షించి చూచుకొనుమని పలుకుచు వినోదముగా బాడుచుండెను.

పన్నగు లొకచోట నిలువక పాటనాలించుచు నారదమహర్షి