పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/268

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుణకేశినికథ.

255

సభజేసి కర్కోటక దృతరాష్ట్ర ప్రభృతుల రప్పించి యిట్లంటిమి.

గరుడుఁడు శేషవాసుకిప్రముఖుల కులస్థులజోలికి బోక నిత్యము సామాన్యకుటుంబములమీఁదఁ బడి నాశనము చేయుచున్నాఁడు. మూషికాద దధిముఖ వసంతకాదినాగకుటుంబములు పేరులేక నశించినవి. పెద్దవారందరు పూనుకొనక యుపేక్షించుచున్నారు. ఇట్లు కొన్నిదినములు జరిగిన నాగకులమే నశించును. ఇందుల కేదియేని యుపాయమాలోచింపవలయునని పెద్దవారిం గోరితిమి.

అప్పుడు వాసుకి మనుమఁడు అశ్వతరుఁడు తక్షకుఁడు కర్కోటకుఁడు నలువురు నాలోచించి మాకిట్లు తెలియజేసిరి. మనతల్లి కద్రువు జేసిన దోసంబునంజేసి వినతకొడుకు మనపై యీసుబూని యిట్టి దారుణక్రియలు గావించుచున్నాఁడు. అతండు మిగుల బలవంతుఁడగుట విరోధించి యతని నేమియుంజేయఁజాలము. కావున నతనిం బ్రార్ధించి సంఘమరణములఁ దప్పింపుమని వేడుకొందము. నెలకొకసారి మా యూరు రావలయుననియు నప్పుడు వంతులువేసికొని యొక్కనాగు నాహారముగా నర్పింతుమనియుం జెప్పుకొనుటయేకాక యట్లు వ్రాసి యిత్తము. అతం డట్లంగీకరించినచో నీయుపద్రవము కొంతవఱకు దగ్గునని యుపన్యసించి మాకుఁ దెలియఁజేసిరి. ఆనిబంధనకు నందున్న నాగకులజులెల్ల నంగీకరించి యప్పుడే సంతకములుజేసి సభాపత్రిక వ్రాసియిచ్చిరి.

ఆమఱునాఁడే గరుడుండువచ్చి యా వీటిపైఁబడి నాగ కుమారుల భక్షింపఁబూని నంత శేషవాసుకి పౌత్రలిరువురు నతని కడకుఁబోయి తమపేరులు సెప్పుకొనిరి గరుత్మంతుని కా రెండు కొలముల వారియెడఁ జాల ప్రీతి గలిగియున్నది. వారింజూచి యతం డిట్టి తఱి మీరేమిటికి వచ్చితిరని యడిగిన వారా పత్రికంజూపుచు మా నాగకులజులెల్ల మిమ్మిట్లు ప్రార్ధించుచున్నారు.