పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/267

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

254

కాశీమజిలీకథలు - పదియవభాగము.

చాశన్ముఖులు దశముఖులు పంచముఖులు త్రిముఖులు ప్రముఖులు నగు నాగకుమారు లనేకులు ప్రఖ్యాతులైయున్నారు. అని తెలియఁజేయుచు నారదుం డాభోగవతీనగరము నడివీధిని నిలువంబడియెను.

అప్పుడందున్న పన్నగప్రముఖులెల్ల నారదమహర్షి వచ్చెనను వార్తవిని గుంపులుగుంపులుగా వచ్చి యతనికి నమస్కరించుచుఁబూజించి మహాత్మా! ఈదివ్యపురుషుఁ డెవ్వఁడు! ఈనడుము మీదర్శనము మాకు లభించుటలేదు. దానంజేసి యితర లోకవిశేషము లేమియుఁ దెలియకున్నవి. క్రొత్తవిశేషము లేవైనంగలిగిన వక్కాణించి మాకానందము గలుగఁజేయుఁడని ప్రార్థించిరి.

నారదుండు వారి నాశీర్వదించుచు విశేషముల కేమియున్నది సర్వలోకములవారు సుఖులైయున్న వారు. ప్రస్తుతము సంగరము లెక్కడను లేవు. గరుత్మంతునివలన మీ రేబాధయుం బొందక సుఖులై యున్నారుగద. అది యట్లుండ తక్షక వాసుకి కర్కోటక కులస్థు లన్యోన్యము కలహింపుచుందురు. మీలో మీకాతగవులు లేక సఖ్యముగలిగియున్నారా? అనియడిగినఁగాళీయుఁడను ఫణిపతియిట్లనియె.

మహాత్మా! మీదయవలన నిప్పుడు మేమందఱము కలిసియే యుంటిమి. మాలో మాకుఁ దగవులేమియును లేవు. గరుత్మంతుని యుపద్రవ మొకమాదిరిగాఁ దగ్గించుకొంటిమి. వినుండు. ఆపక్షి రాజు అవసరమువచ్చినప్పుడెల్ల మావీటిపైఁబడి దొరికిన నాగులనెల్ల బక్షించుచు దయావిహీనుండై బంధుత్వమాలోచింపక నిత్యము మాకుఁ బ్రాణసంకటము గావింపుచుండెను. ఏదినమునవచ్చునో ఎవ్వరిని భక్షించునో తెలియదు. అతండు వచ్చినప్పుడెల్ల వేలకొలఁది నాగులఁ గాలికిఁ దగిలించుకొనిపోయి భక్షించుచుండెను. అనేకనాగకుటుంబములు. పేరులేక నాశనమై పోయినవి. ఆయుపద్రవము భరింపఁజాలక మాలో మాకుఁగల తగవులు వదలుకొని మేమందరము నొకనాఁడొక