పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/266

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుణకేశినికథ.

253

మున వరించినది. వీ రీతని తమ్ములు, విద్యారూపనంపన్నులు చూడుము. ఈప్రదేశముల హృతరాజ్యులగు రక్కసులు వసింతురు. దైత్యులు దేవతలచేఁ బరాజితులై యిందు డాగియుందురు. ఇది వారుణహ్రదము. ఇం దగ్ని సర్వదా ప్రజ్వరిల్లుచుండును. ఇది గాండీవ ముండుచోటు. ఇది వరుణచ్ఛత్రము. ఇందుబడిన వర్షబిందువులు చంద్రకిరణములువలె నాహ్లాదముజేయును. ఇట్టిచోద్యము లనేకము లీలోకమందున్నవి. మనకుఁగల కార్యవ్యగ్రతచే నిది చూడఁదగు సమయముగాదు. వరుణపుత్రులలో నీ కెవ్వరైన నచ్చిరేమో చెప్పు మని నారదమహర్షి యడిగిన మాతలి యంగీకరింపక యవ్వలిలోకములు చూతము పదుఁడు. అని యుత్తరముజెప్పెను.

అప్పుడు నారదమహర్షి యతనితోఁ గ్రిందుగా మఱికొంతదూర మేగి మాతలీ! ఇది రసాతలము సప్తమలోకము. కామధేను విందే యుదయించినది. ఇందలివిశేషము లద్భుతప్రభావయుక్తములు. పన్నగలోకమున స్వర్గలోకమున మనుష్యలోకమునగూడ నిందున్న వారి సౌఖ్యములు గలుగవని గాధగాఁ జెప్పుకొనుచుందురు. ఇందున్న సుందరకుమారుల నందఱం జూడుమని బలుకుచు నందలివింత లన్నియుం జూపించెను. మాతలి కందలి పురుషులు నచ్చలేదు. అవ్వలకుఁ బోదమని ప్రేరేపించెను. నారదుం డతని మఱికొంతదూరము దీసికొనిపోయి మాతలీ! యీనగరమును జూచితివా? దీనిపేరు భోగవతి. త్రిదివమును దేవేంద్రుఁడువలె దీనినివాసుకి పాలించుచున్నాడు. సహస్రఫణాభూషితుండగు శేషుం డిందుండియే శ్వేతభూధరమువలె మెఱయుచు భూమిని మోయుచున్నాడు. ఇందు సురస కొడుకులు నాగకుమారులు దివ్యరూపములతో నొప్పుచు మణిస్వస్తికచక్రాంకులై వేనవేలు సంచరించుచుందురు. వీరు స్వభావముచేత రౌద్రులు. ఇది నాగలోకమునకు ముఖ్యస్థానమగుట నిందు సహస్రముఖులు పం