పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/261

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

248

కాశీమజిలీకథలు - పదియవభాగము.

వెల్లడింపుము. ధీరశాంతునిమాత్రము గోరకేమి ?

చంద్ర - నాకు వేరొకకోరిక లేదు. నాయకలక్షణములు దెలియవు మీరు మువ్వురుగోరిన గుణములన్నియుఁ సంపూర్ణముఁగా నున్న పురుషుని నామనోహరుంగాఁ జేయుటకు నమ్మవారి కనేక వందనము లాచరింపుచున్నాను.

మ - అమ్మనేచెల్ల చెల్లీ! మంచి గడుసుదానవు. ధీరోదాత్త ధీరోద్ధత ధీరలలితుల మువ్వుర గుణములు నీభర్తయం దుండవలయు నేమి? సెబాసు. మాభర్తలకన్న నీభర్తయే యుత్తముఁడైయుండును. కానిండు. సంతోషమే, మఱియొక్కటి చెప్పవలసియున్నది. మన నాయకు లేలోకమువారుగ నుండవలయునో నిరూపించుకొనవలసి యున్నది. దేవతలా? మనుష్యులా? పన్నగులా!

చంద్రకళ - సరి సరి. మనము దేవతలమైయుండ మనభర్తలు మనుష్యులు పన్నగులు నెట్లగుదురు. అట్టిప్రశ్నకే యవకాశములేదే.

మధుమతి - మనుష్యుల సామర్ధ్యము నీవేమి యెఱుంగుదువు? దేవతలకన్న నెక్కువ ప్రతిష్ఠగలవారు మనుష్యులలో ననేకులున్నారు. మన యూర్వశి దేవతల విడిచిపురూరవుని వరించినకథనీ వెఱుంగుదువా?

చంద్ర -- అట్టివా రున్నను వా రల్పాయువులుగారా సఖీ !

మధు — దేవసంపర్కము గలిగినప్పుడు వారు దీర్ఘాయువులే యగుచున్నారు.

వారుణి -- అక్కా! మనష్యు లొకపోలికగా నుందురుగాని పాములకుఁ జక్కఁదన మేమియుండును ?

మధు - ఇదియా మీసందియము. ఇందులకు నేనొక చక్కని కథ జెప్పెద మీరందఱు సావకాశముగా నాకర్ణింపుఁడు. మీసందియము తీరఁగలదు అని మధుమతి చెప్పుచున్నది.