పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/26

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నారదమహర్షి కథ.

13

ఆపత్రికనంతయు విని రాజకుమారుఁడు వయస్యా! ఈజాబు తండ్రిగారు మనకుఁ జూపుమని పంపుటకుఁ గారణమేమనుటయు శారదుఁడు నవ్వుచుఁ జూచుటయేగాక ప్రత్యుత్తర మిమ్మనిరఁట, . మనవిద్యావ్యాసంగ మేపాటిదియో: తెలిసికొనుటకై పంపిరి. కానిమ్ము. ఆపారితోషికము నీవందకుందువా! క్రింద సంగీత విద్యాప్రసంగకర్త యుపబర్హణుఁడు అని వ్రాసిపంపుము. తక్కినవానితో మనకుఁ బనిలేదని పలికి యట్లు వ్రాయించి యాచీటి రాజుగారియొద్ద కనిపెదు.

గంధర్వపతి యుపబర్హణుని వ్రాఁతజూచి చిఱునగవుతో నట్టే ప్రత్యుత్తరము వ్రాసి హేమకూటనగరము న కనిపెను. మఱి రెండు దివసములఱిగిన పిమ్మటఁ గుమారు రప్పించి రత్న కేతుఁడు బాబూ! నీవాసంగీతసభలోఁ బ్రసంగింతునని వ్రాయించితివి. ముక్కుపచ్చలారని నీవెక్కడ! ఆసంగీతసభ యెక్కడ? తగనిపనికిఁ బూనుకొంటివే! ఆమహాసభకు మహావిద్వాంసులందరు రాఁగలరు. తుంబురుఁడనువాఁడు గొప్ప పండితుఁడు. వానిముందర గానములో నితరులు పెదవి గదపఁ గలరా? సభకుఁబోయి యోడివచ్చిన యపఖ్యాతికాదా? అని యేమేమో పలికిన విని కుమారుఁడు మందహాసము గావించెను. శారదుఁడు తప్పక నీపుత్రుఁడా కానుక , బడయఁగలఁడని పన్నిదము వైచెను. అదియుఁ జూతుముగదాయని ఱేఁడు సమాధానముచెప్పెను,

చతుర్దశి సమీపించినంత శుభముహూర్తంబున రత్న కేతుఁడు కుమారుఁ బయనముజేసి శారదప్రముఖులు గంధర్వకుమారులు పెక్కండ్రు వెంటరా ఛత్రచామరాందోళికాది రాజచిహ్నములతో హేమకూటనగరమునకనిపెను. అప్పుడప్పట్టణమంతయు విచిత్రముగా నలంకరింపఁబడియున్నది. గరుడ గంధర్వ కిన్నర సిద్ధ విద్యాధరాది దేవతావిశేషులు గుంపులుగా వచ్చి యందుఁ బ్రవేశించుచున్నారు. .