పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/259

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

246

కాశీమజిలీకథలు - పదియవభాగము.

గీ. నాకముననో తలంప భూలోకముననో
    నాగలోకంబుననొ దేవ నర ఫణాధ
    రులకులంబులనో బ్రాహ్మణులనొ క్షత్రి
    యులనొ యెటువంటి పతులసేయుదువొ మాకు.

అని ప్రార్థించి యించుబోఁడులు నలువురు మబ్బు వెల్వడిన మెఱుఁగుఁ దీగియలభాతి నాగర్భాలయము వెడలి ముఖమంటపము మ్రోలనున్న స్ఫటికశిలావేదికం గూర్చుండి యిట్లు ముచ్చటించుకొనిరి.

ఇంద్రుని కూఁతురు మధుమతి — గంధవతీ! మన యాచార్యుండు సెప్పిన విధానంబున నాఱు సంవత్సరములనుండి యీజగన్మాత నారాధించుచుంటిమిగదా. ఱేపు రాఁబోవు శుక్రవారముతో వ్రతము పూర్తికాఁగలదు. నాఁటి దివసంబు రాత్రి మనయభీష్టము లీయవలసినదియేకదా. మనమిప్పుడే మనకోరికలు నివేదించినచో నాఁటికవి సిద్ధముజేసి యుంచఁగలదు. నీకెట్టి భర్తగావలయో చెప్పుము. భర్తలకన్న మనకుఁ గోరఁతగు వస్తువేమి యున్నది?

యమునికూఁతురు గంధవతి — నవ్వుచు సఖీ! అమ్మవారు మనకుఁ బ్రత్యక్షమై యేమికావలయునని యడిగినప్పుడుగదా కోరికలు దెల్పుట. ఏమియు లేనిదే కోరమనియెద వేలా?

మ — సరి సరి. ఈమె ప్రభావము నీ వెఱుంగవా ! మహర్షులకుఁ గూడ నీమె ప్రత్యక్షముకాదు. ఆరాధించినవారి కోరికలు మాత్రము తీర్చుచుండును.

వరుణునికూఁతురు వారుణి - గంధవతీ ! మన యాచార్యుండు మొదటనే యామాట జెప్పియున్నాడు. నీవు మఱచిపోయితివి.

కుఁబేరునికూఁతురు చంద్రకళ - సఖీ! గంధవతీ! మేము నీకంటె జిన్నవారముగదా. నీయభిలాష ముందుగాఁ దెలిపితివేని తరువాత మాకోరికలు వక్కాణింతుము.