పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/257

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

244

కాశీమజిలీకథలు - పదియవభాగము.

మిఱిమిట్లు గొల్పినవి. వారు దాపునకు వచ్చినకొలంది వారిమాటలు కొంచెము తేటగా వినంబడఁ జొచ్చినవి. వారిభాష సంస్కృతముగా గ్రహించి వారు గీర్వాణులని నిశ్చయించి యతండు విస్మయ సంతోషములతోఁ దదర్చకులు వారేయని తలంచి వారిచర్యలు బరీక్షించు తలంపుతో నందొక గూటిలో నొదిగి చూచుచుండెను.

అంతలో నతని కపూర్వ సౌరభ్యము నాసావర్వము గావించినది. గుడిలో నమ్మవారింబూజించిన పూవుల తావియు నాతావియు నొక్కటిగాఁ దెలిసికొని వారే తదర్చకులని నిశ్చయించి పంచేంద్రియ వ్యాపారములు నేత్రముల యందే వ్యాపింపఁజేసెను.

అప్పుడు నలువురు దేవకాంతలు దివ్య భూషాంబర ధారిణులై వికసితారవింద గంధంబులఁ బరిహసించుమేని తావులు నలుమూలల ఘుమఘుమాయమానంబులై వ్యాపింప నల్లన నాకసమునుండి యా తటాకము తూరుపు తటంబున డిగి కట్టు పుట్టంబులు విప్పి గట్టునంబెట్టి వింతమాట లాడుకొనుచుఁ గొంతసేపు జల క్రీడలుగావించిరి.

అప్పుడు విక్రముఁడు వారింజూచి యౌరా! యీ నారీరత్నములు సురాంగనలు కావలయును, నిత్యమువచ్చి కల్పపాదపప్రసూనములచే నిమ్మహాదేవి నర్చించుచుందురు కాఁబోలు దివ్యకాంతా దర్శనంబునంజేసి నేను ధన్యుండనైతి. మత్పూర్వకృత సుకృత విశేషంబునంజేసి వీరు నాతోమాటాడి రేని నావంటి సుకృతి యెందును లేడని చెప్పఁ గలను. నాకట్టి భాగ్యము పట్టునా? సరిసరి నేను గ్రమ్మఱ మోహమందు చుంటినేల. ఇదంతయుసత్యమనుకొనుచునిట్టియూహబొందుచున్నాను.

మిధ్యావ్యాప్తికిఁ గృతకసంకల్పముతోఁ బనిలేదు. స్వప్నభ్రాంతి యెంతవఱకుఁబోవునో చూచెదంగాక. ఆదేవకాంతలు తీర్థములాడి యీగుడిలోనికివచ్చి యమ్మవారి నర్చింతురుగదా? అప్పటి వీరి కృత్యములు పరీక్షించెదనని తలంచి యప్పుడే గర్భాలయములోనికిఁ