పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/253

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

240

కాశీమజిలీకథలు - పదియవభాగము.

బానీయమును గడుపునిండ గ్రోలెను.

దానంజేసి పంచభక్ష్యపరమాన్నములు భుజించునట్లుగాఁ దృప్తిగలిగి యాకలియంతయు నడంగి యతని కుత్కృష్టమైన బలము గలిగినది. అందులకు వెరగంది యతండాత్మగతంబున నిట్లు తలంచెను. ఇది దేవభూమివలెఁ దోచుచున్నది. మనుష్యసంచారము లేకున్నను యెవ్వరోపచ్చి పుష్పలతలకు నీరుపోసినట్లు వేదికలలికి మ్రుగ్గులుపెట్టు చున్నట్లు మంటపములు తుడుచుచున్నట్లు కనంబడుచున్నవి. ఇందలి పూవుల వాసనలు భూలోకవిలక్షణముగానున్నవి. నేనిదివఱ కిట్టి తావి యాఘ్రాణించియుండలేదు. ఈతటాకము మానససరోవరము కాదుగద. ఇందలిజలంబు లమృతముకన్న రుచికలవగుటయేకాక క్రోలినంత నాకలియడంచి మిక్కిలి బలముగలిగించినవి. గర్భాలయకవాటములుగూడఁ దీయ శక్యమయ్యెనేని లోపలి దేవతదర్శనము జేసి కృతార్థుండ నయ్యెదంగాక. అప్పుడే చీఁకటులు దెసల వ్యాపించుచున్నవి. ఇంచుక వెలుఁగు కలిగియుండఁగనే దేవతం బరికింపందగునని నిశ్చయించి యటఁ గదలి దేవళముమంటపములోనికిం జనునప్పటికి ద్వారశాఖలం జెక్కఁబడియున్న హారతివిగ్రహముల చేతిలోనున్న పైడిపాత్రలయందలి రత్నములు దీపములవలె మెఱయుచు వెలుఁగు గలుగఁజేసినవి. అతండావింత జూచి యోహో! ఈదీపముల నెవ్వరు వెలిగించిరి? ఇందెవ్వరు వచ్చినజూడఁ గనంబడలేదే అని యాశ్చర్యమందుచు విమర్శించి చూచుచు నందు వత్తిగాని చమురుగాని లేకుండుట నవి మణిదీపములని తెలిసికొని మఱియు వింతవడుచుఁ దత్కవాటములు బిగ్గరగా నొక్కి త్రోసెను. తటాలున విడిపోయినవి. మణి దీపములచేఁ బట్టపగలుగా నొప్పుచున్న యాగర్భాలయములో దివ్య తేజంబునం బ్రకాశించు దేవీవిగ్రహ మతనికన్నులకు మిఱుమిట్లు గొలిపినది. అతం డద్దేవతాస్వరూపచిహ్నముల పరిశీలించుచు,