పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/251

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

238

కాశీమజిలీకథలు - పదియవభాగము.

తూర్పుదెస మహాసముద్రము వెఱపు గలుగజేసినది. తక్కినమూడు దిక్కుల నరణ్యమేకాని మఱేమియుఁ గనంబడలేదు. కనుచూపుమేరలో గ్రామమేదియుఁ నున్నట్లు తోచదు. పడమరగా విమర్శింపఁ గొంతదూరములో నీలమేఘాంతరమున మెఱయు మెఱుపుతీగెవలెఁ దరులతాదళాంతరమునఁ దళుక్కురని మెరయుచు బంగారు దీప్తియొకటి యతనికి నేత్రపర్వము గావించినది.

గాలిచే గదలుచున్న యాకులనడుమ మెఱయుచున్న యాతళుకుంజూచిచూచి యదియేదియో తెలిసికొనజాలక దాని నికటంబునకుఁ బోయి చూడవలయునని యభిలాషగలుగుటయుఁ నాప్రదేశము గురుతువెట్టుగొని తటాలున వటవిటపి దిగి తదభిముఖముగాఁ నడువఁ జొచ్చెను. అడుగు వెట్టుటకు సందులేని యాకాంతారములో నొక దండము సంపాదించి దానియూతచే డొంకలు దాటుచు ముల్లు కంపలు తప్పించుకొనుచు బొదలదూరుచు నతి ప్రయత్నమున సంజవేళకెట్లో నాలక్ష్యప్రదేశమునకు శరీరమును జేరవైచెను.

అప్పుడతని కపూర్వపుష్ప సౌరభ్యముఁ ఘ్రాణతర్పణముగావించినది. దాని ననుసరించి మఱినాలు గడుగులు నడిచినంతఁ గొంత తెరపి గనంబడినది. అందొక దేవాలయము బంగారు రేకులచే గట్టఁ బడి సమున్నతప్రాకార మంటపాదులచే నొప్పుచు నతని హృదయమునకు వికాసము గలుగఁజేసినది. అంతకుమున్న తనకుఁ గనంబడిన కాంతిపుంజ మాగుడి పసిండికుండల దీప్తియని యతండు తెలిసికొనియెను. పెన్నిధింగన్న పేదయుంబోలెఁ దద్దర్శనంబు తపఃఫలంబుగా దలంచుచుఁ బరదేవత ప్రత్యక్షమైనట్లు సంతసించుచుఁ త్రిదివసోప వాసపక్లేశ మంతయు నటమటమై పోవ నాకోవెల సమీపమున కరిగి ప్రదక్షిణపూర్వకముగాఁ బ్రహరిచుట్టు తిరిగి తూర్పుముఖముగానున్న సింహద్వారముకడకు వచ్చెను. అందుఁ బెద్ద గోపుర మొప్పుచున్నది.