పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/250

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దేవకన్యలకథ.

237

జేర్చినది. ఇది వరుణద్వీపమో మఱియొకటియో తెలియదు. మా సోదరులుతీరముజేరియుండిరో మృతినొందిరో యెఱుంగ రాదు. వారు లేని నాజీవిక దుఃఖమున కే కారణముగాదే అని తలంచుచు సముద్రముదెస జూచి గుండెలు చెదర నమ్మయ్యో నేనీ మహార్ణవములోఁ బడి బ్రతికి గట్టెక్కితినా? కొండలవలెఁ బొంగి పాతాళమున కరుగుచున్న తరంగముల నడుమమునుఁగుచు నేనెట్లుబ్రతికివచ్చి తీనో! దైవకృపనుమాసోదరులుగూడనిట్లువచ్చిన నత్యానందముగదా. కానిమ్ము నన్ను బ్రతికించిన భగవంతునిసంకల్పమెట్టిదో యట్టు జరుగుంగదా. పడమరగాఁ గొంతదూరము పోయి చూచెద. నీయడవిలోఁ దినుటకుఁ బండ్లేమైనఁ దొరకకపోవునా? అని యాలోచించుచు లేనిబలము దెచ్చికొని కొంతదూరము నడచెను. అడుగులు తడఁబడ దొడగినవి. జాముప్రొద్దెక్కినది. యెండవేడిమి సహించలేక యతం డొక చెట్టు క్రిందఁ గూర్చుండి యటునిటు జూచుచుండెను.

పదిబారల దూరములో నొక వెలగ చెట్టు కనంబడినది. అందు. ఫలము లున్నట్లు తోచినది. మెల్లగా దానికడకుఁ బోయి క్రిందరాలిన పండ్ల నేరియాసక్తితో భక్షించెను. కొంత యాకలి యడింగినది. ఆప్రదేశమున మనష్యులెన్నఁడును సంచరించినట్లు తోచలేదు. కంటక లతాగుల్మాదు లలముకొని పోయినవి. మృగములు నడచిన బాట లక్కడక్కడ గనంబడుచుండెను. అతనిచేత నాయుధ మేదియునులేదు. సత్వకృతమార్గంబుల దూరిదూరి మఱికొంతదూరము పోఁగలిగెను. నీటిజాడ లేమియుఁ గనంబడలేదు.

అందొక వటవృక్షంబు శాఖాసమాచ్ఛాదితదిగంతంబై యతని కాహ్లాదము గలుగఁజేసినది. దాని నీడఁ గోంతసేపు విశ్రమించి యతండాలోచించి యూడ లూతగాఁ జేసికొని యాచెట్టెక్కి మధ్య శాఖాగ్రమున నిలువఁబడి నాలుగుదిక్కులు పరికించి చూచెను.