పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/25

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

కాశీమజిలీకథలు - పదియవభాగము.

నుండి ప్రవాహమువలె శాస్త్రము లావిర్భవించుచుండెను. అచిరకాలములో నాబాలుఁ డశేషవిద్యా పారంగతుడగుటఁజూచివాని గారణజన్మునిగాఁ దలఁచుచుండిరి.

ఒకనాఁడు అమ్మాణవకోత్తముఁడు సవయస్కులగు గంధర్వ కుమారులతోఁగూడి యుద్యానవనంబున హరిలీలావిశేషంబులఁ బాడి కొనుచున్నసమయంబున నొకపరిచారకుం డేదియో పత్రికందెచ్చి యిది ప్రభువుగారు కుమారరాజుగారికిమ్మనిరి. చదివి ప్రత్యుత్తరము తెమ్మనిరని నివేదించుటయు రాజపుత్రుని బాలసఖుండు శారదుండను వా, డా చీటి నందుకొని విప్పి యిట్లు చదివెను.

శ్రీమద శేష గంధర్వ శిరోమణి కిరణ నీరాజిత పాదపీఁఠుడగు రత్న కేతుసార్వభౌముని చరణసన్నిధికి నీమిత్రుఁడు చిత్రరథుఁడువ్రాయు విజ్ఞాపసపత్రిక. ఱేపురాఁబోవు కృష్ణచతుర్దశినాడు మద్గృహంబునఁ బార్వతీపరమేశ్వరులకు నాచే మహాపూజ గావింపఁబడును. అప్పుడు ముప్పదిమూడుకోటులు వేల్పులునింద్రాదిదిక్పతులు సంగీతవిద్వాంసులు మూడులోకంబులఁ బేరుపొందినవారందఱు వత్తురు. తాముగూడ సకుటంబముగా వచ్చి యిమ్మహోత్సన విషయంబులఁ బాలుగొని నన్నానందిందఁ జేయ వేడుచున్నాను,

మఱియు నందొకనాఁడు సంగీతవిద్యాప్రసంగము జరుగును. అందు మొదటివాఁడుగాఁ బేరుపొందిన విద్వాంసునకుఁ బార్వతీమహాదేవి స్వయముగా జేసిన మహతియనువీణ పారితోషికముగానీయ గలదు. అక్కానుకఁబడయుటకై త్రిభువనంబులంగల సంగీతవిద్యా విశారదుల వారిపేరులు పంపుఁడు. మనలో నెవ్వఁడైన నాపారితోషికమందఁ గలిగినచోఁ గులవిద్య నిలుపుకొనినవార మగుదుము.

ఇట్లు విదేయుడు,

చిత్రరథుఁడు.