పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/246

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పశ్చిమదిగ్విజయము.

233

నుండెట్టి దుర్గముననున్నను గాలవ్యత్యయమునఁ బట్టువడక మానఁడు. రావణుని లంకాపట్టణ మెందున్నదియో దేవతలకైనఁ దెలియునా? అట్టినగరము కోఁతి మూకలచే నాశనము జేయఁబడలేదా? ఎట్టివాఁడును గాలమును గెలువలేడు. వానికిఁ గాలము మూఁడినదనియే తలంపుము. లేకున్న మాకిట్టి సంకల్పము పుట్టనేరదు. అప్పటికిఁ దోచిన యుపాయమునుంబట్టి మేమాక్రోధనునిపట్టణము ముట్టడింపఁగలము. వేగముగా నా దీవింజేర్పుమని ప్రోత్సాహపరచెను.

ఆ కర్ణధారుఁడు గనిస్థానములఁ గనిపెట్టి మారు త్రోవల నోడల నడిపించుచుండెను. విక్రము డున్న యోడ ముందు నడిపించు చుండెను. దాని ననుసరించియే తక్కిన యోడలువచ్చుచుండెను. దక్షిణముగాఁ బోయిపోయి ద్వీపము పదియోజనముల దూరములో నున్న దనఁగాఁ బడమరగా నడిపించిరి. అందుఁ క్రోధనుఁడు క్రొత్త గనులవైపించిన రహస్య మా నావికుడెఱుంగఁడు. మఱికొంత దూర మవ్వలఁబోయిన నా గనులు తగులక పోయెడిదే. అమర్మమెఱుంగక యాతఁడీవలగా నడిపించినంత మొదటియోడ గనికిఁదగిలి గుభాలున ప్రేలి యక్కలము వికలమై శకలముగా విడిపోయి సముద్రములో మునిఁగిపోయినది. ఆవెంటనే తక్కిన యోడలుగూడ గనులకు దగిలి కొని పెటపెటార్పటులతో విడిపోయి సముద్రము పాలైనవి.

అప్పుడు హాహాకార రవంబులు సేయుచునందున్న జనులుతమకు దొరకిన సాధనంబులంగైకొని సముద్రములోఁబడి కొట్టుకొని పోయిరి.

అని యెఱింగించిన విని గోపాలుండు గుండెలు బాదికొనుచు నయ్యో! పాపము తాళధ్వజుని పుత్రుల యుద్యమమంతయు గడియలోనటమట మైనదిగదా? స్వామీ! వారుకమ్మఱ జీవించి వత్తురా? ఏమి జరిగినదియో యవ్వలికథ వేగముగాఁ జెప్పుమని యడిగిన నమ్మణిసిద్ధుండు పక్కున నవ్వెను. గోపాలుండందలి యర్థము