పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/243

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

230

కాశీమజిలీకథలు - పదియవభాగము.

వారిమాటలు విని శ్రీముఖుఁడు ఆక్రోధనుఁ డెవ్వఁడు? ఎందున్నవాఁడు? వాఁడు యంత్రబలసంపన్నుఁ డగుంగాక! మాకు లక్ష్యములేదు. వేగఁబోయి వానిం బరిభవింపగలము. వాని వృత్తాంతము చెప్పుమని యడిగిన శ్రీధరుం డిట్లనియె.

వత్సా! ఇక్కడకు నూఱామడదూరములో సముద్రమధ్యంబున వరుణద్వీపము గలదు. అందు వరుణావతియను నగరంబున గ్రోధనుఁడను రాజు యంత్రబలగర్వితుండై యొప్పుచున్నాడు. వానికి దేవతలుగూడ వెరచుచుచుందురు. ఆనగరముచుట్టు ననేకయంత్రము లమరింపఁబడియున్నవి. ఫాలాక్షుండు వానినగరము సొరఁజాలఁడు. చొచ్చినవాఁడెవ్వఁడు చావక తిరిగివచ్చినవాఁడు లేడు. వాని జోలి మీకేల? పెండ్లికొడుకవు సుఖంబుండుమని బోధించిన విని శ్రీముఖుం డావార్త తమ్ముల కెఱింగించెను.

అందు విక్రముఁడు అన్నా! నీవు క్రొత్త పెండ్లికొడుకవు కొన్ని దినములిందుండుము మేమా దీవికిబోయి క్రొధనునింజయించి మహా వీరులని బిరుదములంది వత్తుముగాక. ఆవీటికి మార్గమెట్లో తెలిసి కొనుము. మీ మామగారితోఁ జెప్పి మమ్మందుఁబంపుమని కోరిన నతండు తమ్ములారా! క్రోధనుఁడు యంత్రశక్తిగలవాఁడట వాని నగరమెట్టి వీరుఁడు చేరలేఁడట. చేరిన వాఁడు తిరుగారాఁడట. అట్టి దుర్ఘటకార్యమునకు బూనుకొననేల? అప్పయనము శ్రీధరున కిష్టము లేదని మందలించిన విని విక్రముండిట్లనియె.

అన్నా! మన మింటికడ సుఖంబుండక యిట్టేమిటికి బయలుదేరివచ్చితిమి? నిర్వక్రపరాక్రమంబున విక్రమ గర్వితులఁ బరిభవించి' ప్రఖ్యాతి నొందుటకేకదా! పిఱికిపందల నెందఱంగొట్టిన నేమి యున్నది! క్రోధనునివంటి మహావీరుని జయించినప్పుడే మనపేరులు బైటికివచ్చును. యంత్రబలము తంత్రబలముగూడ మనభుజబలమును