పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/242

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పశ్చిమదిగ్విజయము.

229

నది. రక్షింపుఁడు రక్షింపుఁడని ప్రార్థించెను.

శ్రీముఖుండతని దీనాలాపములు విని జాలిపడి కట్టులు విప్పి గౌరవించుచు లోపలికిఁ దీసికొనిపోయి యతని కొమార్తెం జూపించెను. కమలాదేవి తండ్రింజూచి సంభ్రమముతో నానందాశ్రువులు గ్రమ్మఁ దన నిర్భంధముగుఱించి పరితపించుటయు నతండు ఆమ్మా! వీరు మిక్కిలి బలశాలులు. వీరివృత్తాంతము దెలియక మొదట నిరాకరించితిని. అదియే మన కుపకారమైనది. శ్రీకృష్ణుండు రుక్మిణినిం బోలే వీరిలో శ్రీముఖుఁడు నిన్నెత్తికొనివచ్చెను. నీయదృష్టము ఫలించినది. నీవు విచారింపవలసిన పనిలేదు. దివ్యరూపసంపన్నుండు పరాక్రమశాలి భర్త నీకు లభించెనని యోదార్చుచు వారియానతి పడసి యప్పడఁతి నప్పుడే యందలముపై నెక్కించి కోటలోనికిం దీసికొనిపోయెను. పిమ్మట వారినెల్ల నేనుఁగుల నెక్కించి మంచివిడిదలలోఁ బ్రవేశపెట్టించెను.

శ్రీధరుఁడు శుభముహూర్తంబునఁ గమలాదేవిని శ్రీముఖునికిచ్చి వివాహము గావించెను. అమ్మహోత్సవమునకు శ్రీధరుఁడు పారిపోయిన రాజకుమారులనెల్ల రప్పించి సత్కరించుచు నల్లుండ్ర విద్యాబలపౌరుషాదు లెక్కువగా వారికడ స్తోత్రము గావించెను.

ఆరాజకుమారు లాస్తుతివచనములు విని మీయల్లుండ్రు పాండవులవోలె లోకైకవీరులని యొప్పుకొనియెదము. వరుణద్వీపాధిపతి యగు క్రోధనునితో వీరికిఁ బోరుతటస్తించిన నెవ్వరు గెలుతురోయని సందియముగా నున్నది. వీరతనిం జయించినచో భూమండలంబున వీరికిఁ దుల్యులు లేరని చెప్పవచ్చునని ప్రస్తావముగా ననువదించిరి. అతండు యంత్రబలసంపన్నుఁడు. భుజబలంబున వీరిం జెనకఁజాలఁడు యంత్రసామర్థ్యంబు మనుష్యబలము మించియుండకపోదని శ్రీధరుఁ డుత్తరము జెప్పెను.