పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/240

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పశ్చిమదిగ్విజయము.

227

తమ్ముఁ జుట్టుకొనిన రాజకుమారవర్గంబు నెల్ల నిరర్గళ ప్రహారంబుల గొట్టియుఁ జుట్టియు నేసియు ద్రోసియుఁ బొడిచియు గెడపియు రెండు గడియలలో నామూకలనెల్లఁ జీకాకుఁబడఁజేసి పాండవులు కురుసేనను వలెఁ బీనుఁగపెంటలు గావించుచున్నారు. వీధులన్నియు మేదో రుధిర మాంసకర్దమములై చూడభయంకరముగానున్నవి. వారిముందర నిలిచెడి వీరుడెవ్వఁడును గసంబడఁడు. దేవర విచ్చేయవలయునని చెప్పినంత నమ్మహీకాంతుఁడు కవచంబుదొడిగి ఖడ్గాది సాధనంబులం దాల్చి పేరుగల వాఱువమెక్కి యొక్క,డుగులో నాసంగరరంగమునకుఁ బోయెను.

అప్పు డవ్వీరు లేవురు రాజపుత్రులం దరిమికొనిపోవుచు మా ర్మొగముబెట్టి పారిపోవుచున్న వారినుద్దేశించి సీ! సీ! మీబ్రతు కేల? ప్రాణముల కాసపడి శత్రువులకు వెన్నిచ్చి పాటుట యపఖ్యాతికాదా! నిలుఁడు. పోకుడు అని కేకలువైచుచు లేళ్ళగమిందఱుము పెద్దపులులవలె విజృంభించిపోవుటయుఁ దత్ప్రతాపవాతాహతి దూది పింజలవలె శత్రుసేనలు పలాయనము గావించినవి. అప్పుడు శ్రీధరుండు వారిం బురికొలుపుచు గుఱ్ఱముతో నావీరులయెదుటంబడి పోరుటయు శ్రీముఖుఁడు తనగుఱ్ఱము నతని గుఱ్ఱముమీఁదికి దోలి గదా దండంబున నతనిం గొట్టుటయు నావ్రేటు భరింపఁజాలక యతండు గుఱ్ఱమునుండి నేలఁబడియెను.

అభూపతిపాటు జూచి తద్బలంబులు హాహాకారమిళితముగా రోదనధ్వని వెలయఁజేసిరి. అతనిం గాపాడ దాపునకువచ్చు వీరభటులనెల్ల భల్లంబుల నాపి శ్రీముఖుండు దిగ్గున గుఱ్ఱము డిగ్గనుఱికి యతనిం బట్టికొని గుఱ్ఱముపై కెక్కించితన నెలవునకుం దీసికొనిపోయి నడివీధిని నిలువంబెట్టెను.

అతనికి తెలివివచ్చినది. ఱెక్కలు గట్టబడియున్నవి. యమాత్యాదివీరయోధులెల్ల వారి పరాక్రమమునకోడి దూరదూరముగా