పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/24

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నారదమహర్షి కథ.

11

జపించుచుఁ బుష్కరతీర్థంబున నూరుదివ్యవర్షంబులు తపంబు గావించెను. తత్తపంబునకు మెచ్చి మహేశ్వరుండు ప్రత్యక్షంబై యభీష్టమే మని యడిగిన నతండు విష్ణుభక్తాగ్రేసరు సకలకళాభిరాముఁ గుమారు దయజేయుమని కోరుటయు నవ్వరంబిచ్చి యుమాకాంతుం డంతర్హిహితుం డయ్యెను.

తద్వరప్రభావంబున నచిరకాలములో రత్న కేతునకుఁగుమార రత్నం బుదయించెను. వాని కుపబర్హణుఁడని పేరుపెట్టిరి. ఆబాలుండు శుక్లపక్షక్షపాపాలుఁడు వోలె ననుదినప్రవర్ధమానుండగుచు మాటలతోనే హరినామకీర్తన హితుండు, ఆటలతో విష్ణుకథా ప్రస్తారకోపరతుఁడు నై సర్వజనమనోహరంబగు శైశవంబునఁ దలిదండ్రులకేకాక సర్వగంధర్వలోక మనోహరుఁడై యొప్పుచుండెను.

రత్న కేతుఁ డుచితకాలమున వానింజదువ వేయుటయు గంధర్వవృద్ధులుకులాచార ప్రకారంబున,

క. స రి గ మ ప ద ని యటంచున్
   స్వరములఁ బలికింపఁ దొలుత సంగీతమునన్
   హరి నిగమపద యటంచుం
   బరువడి వర్ణంములమార్చి పలుకు నతండున్ .

వత్సా! ఇది స్వరక్రమముగాదు. తొలుత సకారముచ్చరింపక హకారముచ్చరించెద వేమి? అని యుపాధ్యాయు లాక్షేపింప నాబాలుండు ఆర్యులారా! హకారపూర్వక రివర్ణకముగాని సకారపూర్వ రివర్ణము నానాలుకకు రాదు. సంజ్ఞలలో సవర్ణము హవర్ణముగా మార్చికొనిన దోషములేదని యుక్తి యుక్తముగా నుపన్యసించెను.

ఆయుపన్యాసమువిని గురువులబ్బో ! ఈబాలుండు సామాన్యుఁడు కాఁడు. శాస్త్రములు స్వయముగా రచింపఁగలఁడని యబ్బురపడఁ జొచ్చిరి. అతని కుపాధ్యాయులు నిమిత్త మాత్రమున కే వానినోటి