పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/238

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పశ్చిమదిగ్విజయము.

225

జగన్మోహినివలె మెల్లగాఁ దిరుగుచుండెను.

అట్టి సమయంబునఁ తాళధ్వజుని కొడుకు లేవురు వీర వేషములుదాల్చి గుఱ్ఱములెక్కి ఖడ్గంబులం ధరించి రౌద్రావేశముతోఁ జూపఱకు వెఱపుదోప నతిరయంబున నాసభామంటవద్వారంబున కరిగి యందు గుఱ్ఱంబుల డిగ్గనుఱికిరి.

శ్రీముఖుండు నలువురు తమ్ములు జుట్టును బరివేష్టించి నడువ ఖడ్గహస్తుఁడై లోవలఁ బ్రవేశింపఁ బోవుఁడు ద్వారపాలు రడ్డమువచ్చి భర్తృదారకులారా ! నమస్కారము. మీరిందుఁబోవుట కీయబడిన పత్రికలంజూపి పోవలయు. రాజశాసనమట్టిది. ఏవీ చూపుఁడని యడుగుచుండ పో, పొండు. మమ్మాటంకపరుప మీరెవ్వరని యదలించుచు వారిం ద్రోసికొని సభాభవనంబునం బ్రవేశించిరి. వారుకూర్చుండ దగిన పీఠంబు లెందున్నవని రాజుపురుషులు సభాంతరాళ ముపలక్షింపు చుండిరి. భయభ్రాంతస్వాంతులై రాజకుమారు లాలోకింపుచుండిరి. రండు. రండు. అందుఁగూర్చుండుఁడని పరిజును లాహ్వానింపుచుండిరి.

ఎవ్వరిమాట వినిపించుకొనక యెవ్వరిదెసం జూడక శ్రీముఖుఁడు తమ్ములతోఁగూడ సింహగమనంబునఁ దిన్నగా నారాజపుత్రికయున్న నెలవునకుఁజని యాజవ్వని విస్మయముతోఁ దన్నుపలక్షింపఁ బుండరీ కాక్షుండు రుక్మిణింబోలే నవలీల నాబాలికారత్నమును గుభాలునం సందిటం జిక్కబట్టి యొక్క పెట్టు సభాసదులు హాహాకార రవంబులుసేయ గీరాలున మఱలి చనుచుండెను.

అప్పు డడ్డువచ్చిన రాజభటులనెల్ల నతని తమ్ములు నలువురు కటారి ధారంబరిభవించుచుండ నేయాటంకము లేక శ్రీముఖుఁడు వడివడి నడచుచుఁ ద్వారముల దాటి ఘోటకములకడ కరిగి తన గుఱ్ఱముపై నెక్కించుకొని యక్కలికి భయభ్రాంతయై యొడ లెఱుంగక తడబడుచుండ నుపలాలించుచు దమ్ములు గుఱ్ఱములెక్కి చుట్టునుం బరివేష్టించి