పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/235

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

222

కాశీమజిలీకథలు - పదియవభాగము.

నచో నందున్న యాఁడువారి కాఁడువారువలెఁ గనంబడున ట్లెవ్వరో వరమిచ్చిరని చెప్పితిరి. అట్లె జరిగినది. లెస్సయే కాని తరువాత విద్యాసాగరుని కుమారుని జాతకర్మాద్యుత్సవంబుల కనేకులు మగవారు వచ్చినట్లుగాఁ జెప్పియుంటిరి. వారందఱు నందలివారికి మగవారుగనే కనంబడినట్లు చెప్పియున్నారు. మొదటినియమ మేటికిమారినది? యీసందియము తీర్పుఁడని యడిగిన నవ్వుచు గురుఁడు వత్సా! గట్టి శంకలే చేయుచుంటివి. ఔను. ఆమాట నడుగఁదగినదే. మొదట వరమిచ్చిన సిద్ధుఁడు ప్రమద్వరరక్షణకై యట్లు వరమిచ్చెను. వివాహము వఱకే యానేమము చెల్లునని యాసిద్ధుం డానతియిచ్చియున్నాఁడు దానంజేసి జాతకర్మోత్సవంబున నావ్యత్యయము లేక యధాప్రకారమే జరిగినదని చెప్పి శిష్యునితోఁగూడ నవ్వలిమజిలీ చేరిరి.

అందుఁ జేరినదిమొదలు గోపాలుఁడు స్వామీ! నారదమహర్షి చరిత్రము గొడవగానుండుననుకొంటి. వరప్రసాదుల కధకన్న నదృష్ట దీపుని కధకన్న విజయభాస్కరుని కధకన్న చాల మనోహరముగా నున్నది. పాపము నారదమహర్షి తా నాడుదియై పిల్లలఁగంటినని యెఱుంగఁడుగదా! అతండు తిరుగా మహర్షియై యేమిచేసెనో వినవలయును. అతని తరువాతిపుత్రుల వృత్తాంతము జెప్పుఁడని ప్రార్థించిన సంతసించుచు శిష్యునకు గురుం డిట్లు చెప్పందొడంగెను.

__________

232 వ మజిలీ.

పశ్చిమ దిగ్విజయము.

శ్రీముఖుఁడు విజయుఁడు విక్రముఁడు చిత్రభానుఁడు. నలుఁడు వీ రేవురు తాళధ్వజుని కుమారులు. సులోచనుని తరువాతివారు. ఉత్తరదిగ్విజయము సేయ నరిగిన యన్నలు రాకమున్న వీరు తలిదం