పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/234

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్వగ్రామప్రయాణము.

221

చేసికొని వివాహమహోత్సవంబు గావించి నన్నుఁ దనరాజధానికి రమ్మని వేడుకొనియెను. నే నంగీకరింపక యిందేయుంటిని. ప్రమద్వర సకాలమునఁ బ్రసవమై యీపుత్రరత్నముఁ గనినది. నేఁడే వానికి జాతకర్మోత్సవము చేయుచుంటిమి. లగ్నబలంబున మనమందరము నిందుగలిసియుంటిమి అనితనవృత్తాంతమంతయుఁ దమ్ముల కెఱింగించెను.

అకథ వినిహరివర్మ అన్నా! మనుష్యుల శుభాశుభకర్మంబులు దైవాయత్తములై యుండును. మనుష్యులకంటె మృగములకు భావి శుభాశుభకర్మగ్రహణశక్తి యెక్కువగానుండును. నాగుఱ్ఱము దారితప్పి యిట్లు రాకున్న మనము కలిసికొనలేకపోవుదము. ఇఁక మనమింటికిఁ బోవలయును. అట్టిప్రయత్నము చేయుమని కోరికొనియెను. విద్యాసాగరుని మామగారగు శ్రీవర్ధనునితో దమయభిలాష తెలియఁజేసెను.

అన్నృపతి యంగీకరించి రెండువేల యేనుఁగులు నాలుగువేల గుఱ్ఱములు దాసదాసీసహస్రములు చీనిచీనాంబరములు ధనకనకవస్తు వాహనాదికముల గాణేయముగా నరణమిచ్చి శుభముహూర్తంబున వారికిఁ బ్రయాణము సాగించెను.

రాజపుత్రులు మహావైభవముతో బయలుదేరి నడుమనడుమ శిబిరంబులువైచి విడియుచు దేశవిశేషముల సంగ్రహించుచుఁ నాయా మహీపాలు రర్పించుకానుక లందికొనుచు నీరీతిం బోయిపోయి యొకనాఁడు సాయంకాలమున మార్గవశంబునఁ బరమ బవిత్రమైనద్వారవతీ పుణ్యక్షేత్రము జేరికొనిరి.

క. అని మణిసిద్ధుఁడు దెల్పిన
   విని గోపాలుండు కడు వివేకముతో ని
   ట్లను స్వామి! యీకథాంతర
   మున నాకొక సందియంబుబొడమె వినుఁడొగిన్.

మహాత్మా! ప్రమద్వరయున్నకోటలో మగవారు ప్రవేశించి.